Begin typing your search above and press return to search.

క్లాసిక్‌ సినిమాల పరువు తీయడం ఆపేస్తారా..!

చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సైతం రీ రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక పోయింది.

By:  Tupaki Desk   |   13 May 2025 7:55 PM IST
క్లాసిక్‌ సినిమాల పరువు తీయడం ఆపేస్తారా..!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలోనూ సూపర్‌ హిట్‌ సినిమాలు, అట్లర్‌ ఫ్లాప్‌ సినిమాలు, క్లాసికల్‌ సినిమాలను రీ రిలీజ్ చేయడం పరిపాటిగా మారింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా రీ రిలీజ్ కాగా, ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి నటించిన క్లాసికల్‌ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేక పోతున్న విషయం తెల్సిందే.

చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సైతం రీ రిలీజ్‌లో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేక పోయింది. చిరంజీవి స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి సందడి చేశారు, రీ రిలీజ్ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయినా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేదు. అయిదు కోట్ల రూపాయలను మేకర్స్ ఆశించారు. కానీ సినిమా ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టలేక పోయిందని బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కనీసం మూడు నాలుగు రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఆశించారు. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఆదిత్య 369 సినిమా మాదిరిగానే చిరంజీవి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఎన్నో క్లాసిక్‌ సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నాయి. వాటన్నింటిని ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజు రీ రిలీజ్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో క్లాసిక్ సినిమాలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత బాబోయ్‌ అవసరమా అనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చా ఉంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను 4కే కన్వర్షన్‌ మొదలుకుని పబ్లిసిటీ ఇతర గ్రాఫిక్స్ అంశాలు అన్నింటికి భారీ మొత్తంలోనే నిర్మాత ఖర్చు చేశాడు. తీరా చూస్తే సినిమా ఆ మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకు రాలేక పోయింది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు ముందు మళ్లీ సినిమాను రీ రిలీజ్ చేసి పెట్టుబడి వెనక్కి తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ప్రేక్షకులు కొన్ని సినిమాలను థియేటర్‌లో మళ్లీ మళ్లీ చూడాలి అనుకుంటారు. కొన్ని సినిమాలు పదుల ఏళ్లు దాటినా థియేట్రికల్‌ ఫీల్‌ కలిగిస్తాయి. కానీ కొన్ని సినిమాలు ఫస్ట్‌ విడుదల సమయంలో సూపర్‌ హిట్‌ అయ్యి క్లాసిక్‌గా నిలిచినంత మాత్రాన సెకండ్‌ రిలీజ్‌లో సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం లేదు. కనుక క్లాసిక్ సినిమాలన్నింటిని థియేటర్లలోకి రీ రిలీజ్ పేరుతో మళ్లీ తీసుకు వచ్చే ప్రయత్నాలను నిర్మాతలు మానుకుంటే బాగుంటుంది. పెద్ద సినిమాలను, క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేసి అవి బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడితే పరువు పోవడం తప్ప మరేమి లేదు. కనుక వచ్చే కొన్ని డబ్బుల కోసం ఆశ పడకుండా కాస్త ఆలోచించి రీ రిలీజ్‌ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.