Begin typing your search above and press return to search.

ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. రాబోయే సినిమాలకు గుడ్ న్యూస్

డిస్ట్రిబ్యూషన్ షేరింగ్ మోడల్ విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయినా చర్చలు కొనసాగించాలన్న ఆలోచనతో మరోసారి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   22 May 2025 11:22 AM IST
ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. రాబోయే సినిమాలకు గుడ్ న్యూస్
X

తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల తీవ్ర చర్చకు లోనైన అంశం ఏంటంటే.. జూన్ 1నుంచి ఏపీ, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్న ఎగ్జిబిటర్స్ నిర్ణయం. రోజురోజుకీ ఆదాయ మార్గాలు కష్టాల్లో పడుతున్న నేపథ్యంలో థియేటర్ల అద్దె వ్యవస్థపై డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెరగడం, కంటెంట్ పరంగా సినిమాలు ఆకట్టుకోవడం లేకపోవడం, తద్వారా ఆడిటోరియంలు ఖాళీగా ఉండటంతో ఎగ్జిబిటర్స్ గా తాము మిగతా బాధ్యతలు మోయలేమని స్పష్టం చేశారు.

ఇక ఇదే అంశాన్ని చర్చించేందుకు ఫిలిం ఛాంబర్‌లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది ఎగ్జిబిటర్స్, అలాగే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు సమావేశమయ్యారు. రెంటల్స్, రెవెన్యూ షేర్ మోడల్స్‌పై తీవ్రమైన చర్చలు జరిగాయి. గతంలోనే ఈ వ్యవహారంలో ఒకసారి థియేటర్లు మూతపడ్డాయి. రెమ్యునరేషన్ వ్యవహారంలో షూటింగులు కూడా నిలిచాయి. అయితే రెండింటినీ పరిష్కరించడంలో పెద్దగా ఫలితం రాలేదు.

అదే మళ్లీ థియేటర్లు మూసి తీరుతామంటే, ఇది ఇండస్ట్రీకి మేలు చేసేది కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రకారం జూన్ 1నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత వేయాలన్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎందుకంటే జూన్ నుంచి వరుసగా హై ప్రొఫైల్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘హరిహర వీరమల్లు’, ‘కుబేర’, ‘థగ్ లైఫ్’, ‘కన్నప్ప’ లాంటి సినిమాల మీద నిర్మాతలు భారీగా పెట్టుబడులు పెట్టారు.

ఇలాంటి సమయంలో థియేటర్లు మూసేస్తే వారి మీద మరోసారి తీవ్ర భారం పడుతుంది. అందుకే ఈ వ్యవహారాన్ని ఇంకా శాంతిపూర్వకంగా పరిష్కరించాలనే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్చల మధ్య కొంత ఉద్విగ్నత చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆగ్రహంతో సమావేశం మధ్యలోనే తలుపులు తన్నుకుంటూ బయటికి వెళ్లినట్లు సమాచారం.

డిస్ట్రిబ్యూషన్ షేరింగ్ మోడల్ విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తాయి. అయినా చర్చలు కొనసాగించాలన్న ఆలోచనతో మరోసారి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు మూడు నెలలుగా బాక్సాఫీస్ చాలా డల్ గా ఉంది. రీఎంట్రీగా వచ్చిన రీ రిలీజ్ సినిమాలు, శ్రీ విష్ణు 'సింగిల్' వంటి కొన్ని చిత్రాలే కాసులు కురిపించాయి. ఓవైపు పైరసీ, ఓటీటీ, ఐపీఎల్ ప్రభావం, మరోవైపు టికెట్ ధరలు, రెంటల్ వ్యవస్థలు.. అన్నీ కలిపి థియేటర్ల పరిస్థితిని సంక్లిష్టంగా మార్చాయి. అయినా సరే, ఈ నిర్ణయంతో టాలీవుడ్ పెద్దలు తాత్కాలిక ఉపశమనం పొందారు. ఇప్పుడు సమస్యలపై దీర్ఘకాలిక పరిష్కారం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నది పరిశ్రమ అభిప్రాయం.