Begin typing your search above and press return to search.

సమంత వైజాగ్ సెంటిమెంట్‌... హిట్ ఖాయం

సమంత చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   5 May 2025 6:00 AM
Samantha Returns as Producer with Shubham
X

సమంత చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. తెలుగులో ఈమె చివరగా నటించిన ఖుషి సినిమాతో 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత తెలుగులో ఈమె పెద్దగా సినిమాలు చేయడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు త్వరలోనే శుభం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను రెడీ అయింది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు సమంత రాబోతుంది.

అంతా కొత్తవారితో సమంత నిర్మించిన 'శుభం' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది. ఈనెల 9న విడుదల కాబోతున్న శుభం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో నిర్మాతగా సమంత పాల్గొంటున్నారు. ఈ సినిమాను నిర్మించడం మాత్రమే కాకుండా చిన్న అతిథి పాత్రను చేయడం ద్వారా శుభం సినిమా పై సమంత అంచనాలు పెంచింది అనడంలో సందేహం లేదు. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సమంత వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొంది. ఆ కార్యక్రమంల సమంత మాట్లాడుతూ శుభంపై అంచనాలు పెంచడం మాత్రమే కాకుండా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

శుభం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సమంత మాట్లాడుతూ.... నాకు వైజాగ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మజిలి సినిమా మొదలుకుని చాలా సినిమాలు ఇక్కడ చేశాను. రంగస్థలం కోసం వైజాగ్‌లో చాలా రోజులు ఉన్నాం. అందుకే వైజాగ్‌ ప్రేక్షకులతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సమంత చెప్పుకొచ్చారు. తనకు వైజాగ్‌ ప్రేక్షకులు చాలా విజయాలను అందించారు. ఈ సినిమాతో మరో విజయాన్ని అందిస్తారనే నమ్మకం ఉందని సమంత చెప్పుకొచ్చింది. ఈ సినిమా తో నిర్మాతగా పూర్తి స్థాయిలో మారిన సమంత నటిగానూ ఈ సినిమాలో కొంత సమయం కనిపించిన నేపథ్యంలో తప్పకుండా మంచి విజయాలను సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.

సమంత అనారోగ్య సమస్యల కారణంగా దాదాపు ఏడాది కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉన్న విషయం తెల్సిందే. అందుకే ఈమె కొత్త సినిమాలు ఏమీ ఈ మధ్యలో ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ నటిగా ఈమె త్వరలోనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో ఈ ఏడాది సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈమె సౌత్‌లో కంటే బాలీవుడ్‌లో బిజీగా ఉండాలని ఆశ పడుతున్నట్లు సమాచారం అందుతోంది. సమంత మరో పెళ్లి విషయమై ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సామ్‌ అధికారికంగా స్పందించలేదు.