గద్దర్ అవార్డుల్లో సమన్యాయం జరగలేదా?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డుల ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 2024 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రకటించారు.
By: Tupaki Desk | 31 May 2025 12:40 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డుల ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి 2024 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ప్రకటించారు. అయితే అవార్డుల ప్రకటన విషయంలో సమన్యాయం జరగలేదనే వాదన తెరపైకి వస్తోంది. అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరగలేదనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఏఎన్నార్ సహా అక్కినేని కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన 'మనం'కి అన్యాయం జరిగిందని అక్కినేని అభిమానులు డిమాండ్ చేస్తు న్నారు.
ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా భావిస్తుంది. అక్కినేని తరమంతా కలిసి నటించడంతో ఈ సినిమాకు మరింత ప్రతిష్టత దక్కింది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ చిత్రాన్ని అవార్డు పరిగణలోకి తీసుకోలేదు. కనీసం 'అల్లుడు శీను'కు ఇచ్చిన ప్రాధాన్యత కూడా 'మనం' చిత్రానికి ఇవ్వకపోవడం శోచనీయం అంటున్నారు. సెన్సార్ డేట్ తో పాటు తెలంగాణ ఏర్పాటు తేదీని పరిగణలోకి తీసుకోవడం వల్లే అవార్డు ఇవ్వలేకపోయామన్నది జ్యూరీ వాదనగా వినిపిస్తుంది.
అలాగే ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన 'సైరా నరసింహారెడ్డి'కి కూడా అన్యాయం జరిగినట్లే కనిపిస్తుంది. బ్రిటీష్ పాలకులపై తిరగబడిన రాయలసీమ ఉద్యమకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పాన్ ఇండియాలో ఈ సినిమా రిలీజ్ అయింది. ఓ గొప్ప ఉద్యమ కారుడి జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు. కానీ ఈసినిమా కూడా గదర్ అవార్డుకు నోచుకోలేదు. ప్రతిగా మహేష్ హీరోగా నటించిన 'మహర్షి' చిత్రానికి అవార్డు వచ్చింది. ఇదీ చక్కని సందేశాత్మక చిత్రమే.
యువతలో స్పూర్తి ని నింపే కంటెంట్ ఉన్న చిత్రమిది. అలాగే తెలంగాణ నక్సల్స్ ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'విరాట పర్వారం', నాని నటించిన 'దసరా' చిత్రాలకు కూడా ఎలాంటి అవార్డులు రాలేదు. విరాట పర్వం విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంగా నిలవగా `దసరా` భారీ విజయం సాధించింది. కొన్ని దశాబ్దాల క్రితం నాటి తెలంగాణని ఈ కథలో చూపించారు. అలాగే నాని నటించిన 'హాయ్ నాన్న' కూడా ఈ రేసులో లేదు. ఇలా కొన్ని కీలకమైన చిత్రాలకు అవార్డులు రాకపోవడం అన్నది జ్యూరీపై వ్యతిరే కతకు దారి తీసింది. అవార్డుల ఎంపికలో ఎలాంటి ప్రక్రియను అనుసరించి ఎంపిక చేసారంటూ సోషల్ మీడియాలో వేదికగా ప్రశ్నల వర్షం కురుస్తోంది.
