Begin typing your search above and press return to search.

డ్రగ్స్‌పై యుద్ధం మొదలైంది.. ఈగ‌ల్ టీం ఎంట్రీ: సీఎం రేవంత్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తాను పదవిలోకి వచ్చిన రోజు నుంచే డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశానని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు పాల్పడితే వెన్నువిరిచే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశానని గుర్తు చేశారు.

By:  Tupaki Desk   |   26 Jun 2025 9:04 PM IST
డ్రగ్స్‌పై యుద్ధం మొదలైంది.. ఈగ‌ల్ టీం ఎంట్రీ: సీఎం రేవంత్
X

తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. అయితే అదే రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ మాఫియాలకు కేంద్రంగా మారితే అది మనందరికి నష్టమే అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తాను పదవిలోకి వచ్చిన రోజు నుంచే డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశానని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌కు పాల్పడితే వెన్నువిరిచే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమాల గడ్డ అని గుర్తు చేస్తూ, అదే నేలపై డ్రగ్స్ వ్యాప్తి చెందితే అది రాష్ట్రానికి మచ్చలేనన్నారు. విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే డ్రగ్స్ వలలో పడిపోతున్నారన్న ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలల దగ్గర చాక్లెట్లతోపాటు గంజాయి చాక్లెట్లు అమ్మే పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇటువంటి పరిస్థితిని నిలువరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, పిల్లల ప్రవర్తనను గమనించేందుకు ‘బిహేవియర్ అబ్జర్వర్’ల పేరుతో ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని సూచించారు. పిల్లల్లో మార్పులు కనిపించిన వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

డ్రగ్స్ రవాణా, విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈగ‌ల్‌’ అనే ప్రత్యేక విభాగం ద్వారా 24 గంటల నిఘా కొనసాగుతుందని తెలిపారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ పట్టుబడితే, యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి సినీనటులు రామ్‌చరణ్‌, విజయ్ దేవరకొండ హాజరై యువతలో చైతన్యం కలిగించారు. వీరి హాజరుపై సీఎం స్పందిస్తూ, ఎంత బిజీగా ఉన్నా దేశానికి మంచి చేయాలనే తపనతో వచ్చారన్న మాట చెప్పారు. కార్యక్రమంలో దిల్ రాజు, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తెలిపారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు స్పోర్ట్స్ పాలసీ, స్కిల్స్ యూనివర్శిటీ వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సహకారంతోనే డ్రగ్స్ అనే రాక్షసాన్ని అంతమొందించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు.