'బుర్రలేని దర్శకులు' ఒక దర్శకుడిని ఎలా సృష్టించారు!
ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ వంటి హీరోలను ఆయనే పరిచయం చేసిన విషయం తెలిసిందే.
By: Sivaji Kontham | 15 July 2026 9:08 AM ISTసినిమా రంగంలో ఒకరు దర్శకుడిగా మారడానికి అగ్ర దర్శకుల స్ఫూర్తి లేదా పెద్ద పెద్ద సంస్థల ప్రోత్సాహం కారణమని చాలామంది చెబుతుంటారు. అయితే ప్రముఖ దర్శకుడు తేజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనికి భిన్నమైన, ఆసక్తికరమైన కారణం చెప్పి ఆశ్చర్యపరిచారు. తనలోని దర్శకుడు బయటకు రావడానికి తాను పనిచేసిన 'బుర్రలేని దర్శకులే` కారణమని ముక్కు సూటిగా అంగీకరించారు. తన కెరీర్ ప్రారంభ రోజుల్లో కొంతమంది దర్శకులకు సరైన అవగాహన, ప్రతిభ లేకపోవడం వల్ల... వేరే దారి లేక తానే సెట్స్‌లో బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని.. ఆ పరిస్థితులే తనలోని అసలైన దర్శకుడిని నిద్రలేపాయని తేజ వివరించారు.
పరిశ్రమలో ప్రతిభ లేని దర్శకులతో పనిచేయడానికి ముందే.. తేజ ముంబైలో అగ్ర దర్శకుల వద్ద పని నేర్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ, మహేష్ భట్ వంటి సూపర్ సీనియర్ డైరెక్టర్ల తో కలిసి పనిచేస్తూ సినిమా రూపకల్పనలోని మెళకువలను తేజ నేర్చుకున్నారు. అయితే ఆ మహామహులతో పాటు.. కనీస ప్రతిభ ..పట్టుదల లేని కొందరు దర్శకుల వద్ద కూడా ఆయనకు పనిచేసే అవకాశం వచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత కానీ తేజకు అసలు విషయం అర్థమయ్యేది కాదు. ఆ దర్శకులకు సినిమా నాణ్యతపై ఎలాంటి శ్రద్ధ ఉండేది కాదని... ఏది పడితే అది తీసేసి ఎలాగోలా సినిమాను ముగించేద్దామనే ధోరణిలో వాళ్లు ఉండేవారని ఆయన గుర్తుచేసుకున్నారు.
సెట్స్‌లో దర్శకులకు ఉన్న ఈ నిర్లక్ష్యమే తేజను అనివార్యంగా డైరెక్టర్ కుర్చీ వైపు నడిపించింది. ఒక సినిమాలో హీరోయిన్ ఒక ఎమోషనల్ సీన్‌లో తప్పుడు ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంటే.. ఆ తప్పును డైరెక్టర్‌కు చూపించగా... ఆ దర్శకుడు బాధ్యత తీసుకోకుండా "సరే... నీకు ఎలా కావాలో నువ్వే తీసుకో" అని తేజకు వదిలేశారట. ఆ సీన్ పూర్తయ్యాక `కట్` చెప్పి చూసేసరికి అసలు డైరెక్టరే అక్కడ లేరని..."సార్, ఓకేనా?"అని అడిగితే... "నీకు ఓకే అయితే నాకు ఓకే" అని ఆ దర్శకుడు సమాధానమిచ్చాడని తేజ నవ్వుతూ చెప్పారు. అలా ఆ సినిమా బాధ్యత అంతా తేజ భుజాలపై పడటం... ఆ తర్వాత ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
ఆ ప్రతిభ లేని దర్శకులు ఎవరు? ఆ సినిమా పేరేంటి అని జర్నలిస్ట్ తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా.. తేజ ఎక్కడా వారి పేర్లను బయటపెట్టకుండా తన వృత్తిపరమైన విలువలను చాటుకున్నారు. ప్రస్తుత యూట్యూబ్ కాలంలో ఇలాంటి విషయాలను పబ్లిక్ చేయడం చాలా సులభమే అయినా.. ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం లేదా అవమానించడం తన పద్ధతి కాదని ఆయన స్పష్టం చేశారు. తోటివారిని వీలైనంత వరకు గౌరవించాలనేదే తన సిద్ధాంతమని చెప్తూ... అమితాబ్ బచ్చన్ నిర్మాణ సంస్థ ABCL పతాకంపై వచ్చిన `తేరే మేరే సప్నే` హిందీ సినిమాకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా తను ఎంపికైన తర్వాతి ప్రయాణాన్ని వివరించారు.
తెలుగు చిత్రసీమలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపిన దర్శకులలో తేజ ఒకరు. 'చిత్రం', 'నువ్వు నేను','జయం' వంటి క్లాసిక్ లవ్ స్టోరీలతో అప్పట్లో సంచలన విజయాలను అందుకున్నారు. ఆయన దర్శకత్వ శైలి చాలా విలక్షణంగా ఉంటుంది. ఎక్కువగా కొత్త నటీనటులను పరిశ్రమకు పరిచయం చేయడానికి ఆయన మొగ్గు చూపుతారు. ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్ వంటి హీరోలను ఆయనే పరిచయం చేసిన విషయం తెలిసిందే. తేజ సినిమాలలో ప్రేమకథలతో పాటు విలన్ల క్రూరత్వం.. హీరో సంఘర్షణ.. భావోద్వేగాలు చాలా సహజంగా.. కాస్త రాగా ఉంటాయి. నటీనటుల నుండి ఉత్తమ నటనను రాబట్టుకోవడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పంథా ఉంది. 2017లో రానాతో తీసిన `నేనే రాజు నేనే మంత్రి`సినిమాతో పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లోనూ తన మార్కును నిరూపించుకున్నారు.
దర్శకుడు తేజ 2023లో వచ్చిన 'అహింస' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం కొన్ని సినిమాలపై పని చేస్తున్నారు. తన కుమారుడిని హీరోగా గ్రాండ్‌గా పరిచయం చేస్తూ 'హనుమంతు'అనే సినిమాను తెరకెక్కిస్తున్నారని కథనాలొచ్చాయి. తన మొదటి బ్లాక్‌బస్టర్ సినిమా 'చిత్రం 1.1'కు సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను కూడా తేజ లైన్‌లో పెట్టారు. ఇందులోనూ భారీగా కొత్తవారిని పరిచయం చేయబోతున్నారని సమాచారం.
