దీపికను 18గం.లు పని చేయాలని కోరలేదు కదా?
ప్రభాస్ `స్పిరిట్` నుంచి దీపిక పదుకొనేను తొలగిస్తూ, దర్శకుడు సందీప్ వంగా తీవ్రమైన నిర్ణయాన్ని ప్రకటించాక ఇది చాలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jun 2025 7:24 PM ISTప్రభాస్ `స్పిరిట్` నుంచి దీపిక పదుకొనేను తొలగిస్తూ, దర్శకుడు సందీప్ వంగా తీవ్రమైన నిర్ణయాన్ని ప్రకటించాక ఇది చాలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 8 గంటల పని నియమాన్ని ఉల్లంఘించి 6 గంటలే సెట్స్ లో పని చేస్తానని, ప్రమోషన్స్ కి సహకరించలేనని, సీన్ లో లిప్ సింక్ తన పని కాదని దీపిక చెప్పడంతో, ఈ ప్రాజెక్ట్ నుంచి తొలగించినట్టు కథనాలొచ్చాయి.
ఆ తర్వాత ఇండస్ట్రీలో కొత్తగా తల్లులు అయిన నటీమణుల పని గంటల గురించి పెద్ద డిబేట్ మొదలైంది. కొత్త తల్లులకు వెసులుబాటు ఉండాలని కొందరు, గ్లామర్ రంగంలో సుదీర్ఘ పనిగంటలు తప్పవని మరికొందరు డివైడ్ అయ్యి దీనిపై డిబేట్ నడిపించారు. ఇటీవల జెనీలియా మాట్లాడుతూ .. కొన్నిసార్లు సుదీర్ఘ సమయం పని చేయాల్సి రావొచ్చని వ్యాఖ్యానించారు. స్పిరిట్ లో నటించాలని మనస్ఫూర్తిగా అనుకుంటే దీపిక నటించి ఉండేదని కూడా జెనీలియా అభిప్రాయపడింది.
అయితే బాలీవుడ్ యువనటి బానిట సంధు సుదీర్ఘ సమయం సెట్లో పని చేయడాన్ని నిరాకరించింది. బానిట ఇంతకుముందు వరుణ్ ధావన్ సరసన అక్టోబర్ లో నటించింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `బ్రిడ్జర్టన్`లోను నటించి మెప్పించింది. అయితే బనితా సంధు 18 గంటల షూటింగ్ షెడ్యూల్‌లతో అలసిపోవడాన్ని వ్యతిరేకించిన తర్వాత నిర్మాతలు తన పేరును `బ్లాక్‌లిస్ట్`లో పెట్టారని వ్యాఖ్యానించింది.
న్యాయమైన పని సమయం కావాలని పట్టుబట్టడాన్ని పరిశ్రమలోని దర్శకనిర్మాతలు సరిగా స్వీకరించలేదని ఆమె వెల్లడించింది. ఒకరి మానసిక ఆరోగ్యాన్ని ఇలాంటి పని కారణంగా పణంగా పెట్టకూడదని బానిట సంధు వ్యాఖ్యానించింది. సినీ పరిశ్రమలో బలమైన నియమ నిబంధనల అవసరాన్ని బనితా నొక్కిచెప్పారు. ఇక్కడ యూనియన్లు నటులు, సిబ్బందిని కాపాడతాయి. షూటింగ్‌ల మధ్య సరైన విరామాలు ఎలా ఉండాలో కూడా బానిట మాట్లాడింది. హిందీ సినిమా విషయంలో ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది. కానీ నా కెరీర్ ప్రారంభంలో పరిశ్రమలు ఎలా పనిచేస్తాయో నాకు నిజంగా అర్థం కానప్పుడు, నేను పని చేయడానికి ఇదే మార్గం అని అనుకున్నాను. నేను రోజుకు 16-18 గంటలు షిఫ్టులు పని చేశాను. నేను రోజంతా షూటింగ్ చేసి, రాత్రి విమానంలో ప్రయాణించేదానిని. నేను 24 గంటలు నిద్రపోలేదు. నా కోసం, సిబ్బంది కోసం నేను నిలబడ్డాను. ఇది సరైనది కాదని నేను నిర్మాతలకు చెప్పాను. బహుశా నేను ఇప్పుడు ఆ పరిశ్రమ నుండి బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నాను. కానీ నేను అది పట్టించుకోను.. సరైన దాని కోసం నిలబడతాను అని బానిట అన్నారు.
అయితే బానిట వెర్షన్ తో కొన్ని చిక్కులు ఉన్నాయి. బానిట 18 గంటల పనిదినం తప్పు అని అంది. అది సరైనదే. కానీ ఇక్కడ దీపిక కేవలం 6 గంటలే పని చేస్తానని కోరింది. 8 గంటలు పని చేయాల్సిందేనని సందీప్ వంగా కోరాడు. కొత్తగా తల్లయిన దీపికను 18 గంటలు పని చేయాలని కోరలేదని గమనించాలి. అయితే తనను ఒక పరిశ్రమ బ్యాన్ చేసిందని సదరు నటీమణి పేర్కొంది. అది ఏ పరిశ్రమ అంటే కోలీవుడ్ అని అంతా భావిస్తున్నారు. కోలీవుడ్ లో బానిట ఒకే ఒక్క సినిమాలో నటించింది. 2019 లో అమెరికన్ టీవీ సిరీస్ పండోర, తమిళ చిత్రం `ఆదిత్య వర్మ` వచ్చాయి. తరువాత ఆమె సర్దార్ ఉధమ్ లో కనిపించింది. ఆదిత్య వర్మలో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ సరసన బానిట నటించింది. ఆ తర్వాత తమిళంలో సినిమా అవకాశం లేదు.
