Begin typing your search above and press return to search.

ఫైట‌ర్ వ‌సూళ్లపై త‌ర‌ణ్ ఆద‌ర్శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌

జనవరి 25 న ఫైట‌ర్ విడుదలైనప్పటి నుండి ఏడవ రోజు కూడా ఎటువంటి మెరుగుదలని చూపలేదని, దేశీయ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా కొనసాగుతోంద‌ని త‌ర‌ణ్ ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 6:04 AM GMT
ఫైట‌ర్ వ‌సూళ్లపై త‌ర‌ణ్ ఆద‌ర్శ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌
X

హృతిక్ రోషన్ `ఫైటర్` బాక్సాఫీస్ వద్ద కష్టాల్లో పడిందని ప్ర‌ముఖ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేసారు. విదేశాల‌తో పోలిస్తే, భార‌త‌దేశంలో బాక్సాఫీస్ నంబ‌ర్లు స‌రిగా లేవంటూ తేల్చేశారు. జనవరి 25 న ఫైట‌ర్ విడుదలైనప్పటి నుండి ఏడవ రోజు కూడా ఎటువంటి మెరుగుదలని చూపలేదని, దేశీయ బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా కొనసాగుతోంద‌ని త‌ర‌ణ్ ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించారు.

ప్ర‌ఖ్యాత సాక్ నిల్క్ క‌థ‌నం ప్ర‌కారం..ఈ చిత్రం భారతదేశంలో బుధవారం దాదాపు రూ.6.35 కోట్ల నికర వ‌సూళ్ల‌ను రాబట్టింది. ఈ సినిమా మంగళవారం సాధించిన రూ.7.5 కోట్ల వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇది దాదాపు రూ.1.15 కోట్లు తక్కువ. ఓవర్సీస్ లో `ఫైటర్` బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ప్ర‌స్థావిస్తూ.. తరణ్ ఆదర్శ్ ట్వీట్ లో నిరాశను వ్య‌క్తం చేశారు. ``ఫైటర్ చిత్రం భారతదేశ వ‌సూళ్లు దిగ్భ్రాంతికి గురిచేసాయి. ఓవర్సీస్‌ను ఈ చిత్రం కుదిపేసింది... ఫైటర్ పనితీరు పరిశ్రమలో షాక్ వేవ్‌లను పంపింది... ఊహించండి.. ఈ చిత్రం ఉత్త‌మ‌మైన‌ స్టార్లు.. ఉత్త‌మ‌ దర్శకుడు క‌లిసి ప‌ని చేసారు. విమర్శకుల అద్భుత‌ ప్రశంసలు... ప్రేక్షకుల సానుకూల‌ ఫీడ్‌బ్యాక్ ఉన్నా కానీ ఫ‌లితం తారుమారైంది. భారతదేశంలో తగ్గుతున్న బాక్సాఫీస్ నంబ‌ర్లు పూర్తిగా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి`` అని రాసారు.

``సంవత్సరం ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తిన‌డం నిజంగా ఆందోళనకరం. భారతదేశంలో వ‌సూళ్లు తగ్గుముఖం పడుతుండగా, కీలకమైన అంతర్జాతీయ మార్కెట్లలో బిజ్ బలంగా కొనసాగుతోంది, * వారం రోజులలో కూడా... #USA, కెనడా, ఆస్ట్రేలియా, NZ (న్యూజిలాండ్) వంటి మార్కెట్‌ల‌లో వ‌సూళ్లు బావున్నాయి. అద్భుతమైన వారాంతం తర్వాత కూడా చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఈ వైరుధ్యాన్ని ఎలా విశ్లేషించాలి?`` అని వాపోయారు త‌ర‌ణ్‌.

హృతిక్ త్యాగం వృధా:

ఫైటర్ కోసం హృతిక్ చాలా శ్ర‌మించారు. చాలా త్యాగాలు చేసారు. పర్ఫెక్ట్ బాడీ షాట్‌ల కోసం పొగ తాగ‌డం కూడా ప్రారంభించారు. ఫైట‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే ముందే నేను మూడుసార్లు రూపం మార్చుకోవాల్సి వచ్చింది..అని హృతిక్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సినిమా ప్రారంభమయ్యే ముందు నా సామర్థ్యం ఎప్ప‌టిలానే ఇంకా ఉందో లేదో తనిఖీ చేయడానికి ఒకసారి... సినిమా సెట్స్ పైకి వెళ్లిన‌ప్పుడు మరొకసారి... ఆపై షూట్‌ను రద్దు చేయాల్సిన ప‌రిస్థితిలో మూడోసారి రూపాంత‌రం చెందాల్సి వ‌చ్చింది. కేవ‌లం 6-8 వారాలలో మూడవ రూపాంతరం కోసం శ్ర‌మించాల్సి వచ్చింది. ఇది చాలా కష్టమైన ప‌ని. నేను రూపంలో మార్పు కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు మూడు పాటలను తిరిగి షూట్ చేయాల్సి వచ్చింది... అని హృతిక్ త‌న క‌ష్టం గురించి తెలిపారు. హృతిక్, దీపిక ప‌దుకొనే స‌హా ఇత‌రుల శ్ర‌మ ఫ‌లించ‌లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.