Begin typing your search above and press return to search.

హిందీ ప‌రిశ్ర‌మ వంచ‌నపై తాప్సీ బాంబ్

తాను ఒక లైన్ వినిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఇందులో హీరో ఎవ‌రు? అని అడిగార‌ని కూడా తాప్సీ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 12:30 AM GMT
హిందీ ప‌రిశ్ర‌మ వంచ‌నపై తాప్సీ బాంబ్
X

సౌత్ లో అగ్ర క‌థానాయిక‌గా ఎద‌గాల‌న్న తాప్సీ ప‌న్ను క‌ల నెర‌వేర‌ని సంగ‌తి తెలిసిందే. ఇక్కడ క‌ల చెద‌ర‌గానే, ముంబైలో అడుగుపెట్టి బాలీవుడ్ లో వ‌రుస ప్ర‌య‌త్నాలు చేసింది. న‌టిగా బాగానే స‌క్సెసైంది. అక్క‌డ ప‌లు విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల్లో న‌టించింది. ఇటీవ‌లే నిర్మాత‌గాను మారింది. అయితే నిర్మాత‌గా తొలి అడుగుల్లోనే తాప్సీ ప‌న్ను ఎంతో విసిగిపోయింద‌ని త‌న మాట‌ల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. స్టార్ సిస్ట‌మ్ ని మించి కంటెంట్ కి ప‌ట్టంగ‌డ‌తార‌న్న దానిని ఖండిస్తూ అదంతా క‌ప‌ట‌త్వం అని కామెంట్ చేసారు తాప్సీ. తాను ఒక లైన్ వినిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఇందులో హీరో ఎవ‌రు? అని అడిగార‌ని కూడా తాప్సీ వ్యాఖ్యానించారు.

తాప్సీ నిర్మించిన 'ధక్ ధక్' త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా నిర్మాత హోదాలో తాప్సీ పన్ను బాలీవుడ్‌లోని 'స్టార్ సిస్టమ్' ని ట‌చ్ చేస్తూ ఇందులో 'చాలా కపటత్వం ఉంది' అని తాజా ఇంట‌ర్వ్యూలో కామెంట్ చేసారు. న‌టిగా తాప్సీ అసాధారణమైన సాహసోపేతమైన ఎంపికలు బాలీవుడ్ లో ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. వ‌రుస‌గా విజయవంతమైన కంటెంట్-ఆధారిత చిత్రాలలో న‌టించింది. పరిశ్రమలో న‌మ్మ‌ద‌గిన న‌టిగా ముద్ర వేసింది. స్టార్ డ‌మ్ కొన‌సాగుతుండ‌గానే త‌న‌ సొంత నిర్మాణ సంస్థ అవుట్‌సైడర్ ఫిల్మ్స్‌ను ప్రారంభించి మ‌రొక అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతానికి ఈ బ్యాన‌ర్ లో తాప్సీ రెండు చిత్రాలను నిర్మించింది. బ్లర్ అనే చిత్రాన్ని జీ 5 కోసం నిర్మించింది.

ఇటీవల ధక్ ధక్ ని నిర్మించి విడుద‌ల‌కు సిద్ధం చేసింది. రత్న పాఠక్ షా, సంజన సంఘీ, దియా మీర్జా, ఫాతిమా సనా షేక్ త‌దిత‌రులు ఇందులో నటించారు. నిర్మాత‌గా తన గేమ్‌లో దూసుకెళుతున్నా కానీ తాప్సీలో ఎందుక‌నో నిరాశ‌ అలానే మిగిలి ఉంది. అది ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. ఇటీవలి ఇంటర్వ్యూలో తక్కువ-బడ్జెట్ సినిమాలు 'స్టార్ సిస్టమ్' వ‌ల్ల ఎలా వంచ‌న‌కు గుర‌వుతున్నాయో ప్ర‌స్థావించింది. పెద్ద సినిమాల‌కు ఉన్న ప్ర‌చారం చిన్న సినిమాల‌కు ద‌క్క‌ద‌ని కూడా నిరాశ‌ను క‌న‌బ‌రిచింది. హిందీ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న వంచన గురించి చర్చించింది.

బాలీవుడ్‌లో ప్రబలంగా హిపోక్రసీ తాప్సీ పన్ను ఇటీవల జాతీయ మీడియాతో సంభాషణలో తీవ్రంగా స్పందించింది. అర్ధవంతమైన చిత్రాలకు మద్దతు లేకపోవడంపై తాప్సీ సీరియ‌స్ అయింది. ఒక ఇంటర్వ్యూలో చిత్ర‌ పరిశ్రమలో ప్రబలంగా ఉన్న హిపోక్రసీ గురించి మాట్లాడింది. సినిమా గురించి ఒక లైన్ అయినా వినకముందే 'హీరో ఎవరు?' అనేది తెలుసుకోవాలనుకుంటార‌ని తెలిపారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్మేవారికి నేను చెప్పేది ఇదే.

ఇదంతా ఒక‌ అపోహ. ఈ (ధక్ ధక్) సినిమా తీస్తున్నప్పుడు ఆ క‌ల‌ చెదిరిపోయింది. ప‌రిశ్ర‌మ‌లో చాలా కపటత్వం ఉంది. వారు మీ వన్-లైన్ స్టోరీని విని "పిక్చర్ మే యాక్టర్ కౌన్ హై (సినిమాలో హీరో ఎవరు)?" అని వెంట‌నే అడుగుతారు. అది ప్రాజెక్ట్‌లో పెట్టుబడిని నిర్ణయిస్తుంది! అని తాప్సీ పేర్కొంది. హీరో ఎవ‌రో తెలియ‌క‌పోతే ఆ సినిమాని పట్టించుకోర‌ని కూడా అంది. అయితే తాను న‌టించేప్పుడు నాయికా ప్ర‌ధాన చిత్రాల‌కు ఆద‌ర‌ణ ద‌క్కింద‌ని కూడా తాప్సీ అంగీక‌రించింది.

అప్పుడు ఇబ్బంది లేదు కానీ..! ఒక సినిమాకి సంతకం చేసేటప్పుడు, తన సహనటుడి గురించి లేదా నిర్మాణ సంస్థ ఎంత పెద్ద‌ది అని ఎవ‌రూ ఎప్పుడూ అడగలేదని తాప్సీ చెప్పింది. కొత్తగా వచ్చిన చాలా మంది తొలిచిత్ర‌ దర్శకులు సహనటులతో కలిసి పనిచేసినట్లు గుర్తుచేసుకుంది. ఎవ‌రైనా హీరోని న‌మ్ముతారు. కంటెంట్ ని న‌మ్ముతార‌నేది అబ‌ద్ధం. ప‌రిశ్ర‌మ‌లో ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతికి కారణమని చెప్పాలి. ఇందులో నటీనటులు, స్టూడియోలు, ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇది ఒక చక్రంజ‌.. అని మెలిక పెట్టి మాట్టాడింది తాప్సీ.

చిన్న చిత్రాల‌ను నిర్మించే స్టూడియోలు తమ పెట్టుబడిని డిజిటల్ హక్కులను విక్రయించడం ద్వారా తిరిగి పొందుతున్నాయి. దీనివల్ల సినిమాను థియేట‌ర్ల‌లో విడుదల చేయడంపై కనీస ఆసక్తి ఉండదు. ఇది పరిశ్రమ వృద్ధికి హానికరం! అని తాప్సీ వ్యాఖ్యానించారు. ఎందుకంటే మీడియాలో పెద్ద పేర్లను మాత్రమే ఎనేబుల్ చేస్తూ వారికే ప్ర‌చారం క‌ల్పిస్తున్నార‌ని కూడా తాప్సీ విమ‌ర్శించారు. ఇలా అయితే మిగిలిన వారికి అవకాశం ఎలా లభిస్తుంది? అని నిల‌దీశారు. ఇది స్టార్ల మధ్య అంతరాన్ని మాత్రమే పెంచుతుంది. బాలీవుడ్ అర్థవంతమైనదాన్ని ప్రయత్నించదని చెబుతూనే ఉంటాం. కానీ మేము కొత్త‌గా ప్ర‌యత్నించినప్పుడు అరుదుగా మాత్ర‌మే మద్దతు ఉంటుందని ఇది మారాల‌ని తాప్సీ కోరుకున్నారు.