కొత్త డైరెక్టర్‌ను నమ్మి రిస్క్ చేసిన భరణి..
ఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవారు కూడా మళ్లీ ఆ కథను ఆసక్తిగా చదువుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 13 May 2026 5:00 PM ISTఒక్క రూపాయి రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినవారు కూడా మళ్లీ ఆ కథను ఆసక్తిగా చదువుతున్నారు. ఎందుకంటే ఆయన కేవలం నటుడే కాదు.. రచయితగా, గురువుగా, మంచి మనిషిగా కూడా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భరణి.
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా రెమ్యునరేషన్, మార్కెట్, క్రేజ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ఒక రూపాయి కోసం సినిమా చేయడం, అది కూడా డైరెక్టర్ నమ్మకంతో చేయడం అరుదైన విషయం. ఆ అరుదైన సంఘటనే డైరెక్టర్ తేజ తొలి సినిమా చిత్రం టైమ్ లో జరిగింది. అప్పట్లో తేజ అసిస్టెంట్ కెమెరామెన్‌గా ఇండస్ట్రీలో తన ప్రయాణం కొనసాగిస్తున్న రోజులు. ఆ సమయంలోనే తనికెళ్ల భరణితో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. తర్వాత డైరెక్టర్ గా మారే ప్రయత్నంలో భాగంగా చిత్రం కథను భరణికి వినిపించారట.
కథ విన్న వెంటనే అందులోని నిజాయితీ, కొత్తదనం భరణిని ఆకట్టుకున్నాయట. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఆయన చెప్పిన మాట ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉదాహరణగా చెప్పుకుంటారు. ఆ సినిమా చేస్తున్న టైమ్ లో ఈ సినిమా హిట్ అయితే ఒక్క రూపాయి ఇవ్వు.. లేదంటే అవసరం లేదు అని తేజతో చెప్పారట. భరణి చెప్పిన ఆ మాటలో డబ్బుకంటే నమ్మకం ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త డైరెక్టర్ టాలెంట్‌ను ముందే గుర్తించిన భరణి, అతనికి తనవంతు అండగా నిలిచారు. తర్వాత ఏమైందో తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే. చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. యువతను ఊపేసిన ఆ సినిమా తేజ కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. సినిమా సక్సెస్ తర్వాత తనికెళ్ల భరణికి తేజ లక్ష రూపాయలు ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నారట. ఒక్క రూపాయితో మొదలైన ఆ ప్రయాణం లక్ష రూపాయల గౌరవంగా మారడం వెనుక స్నేహం, విశ్వాసం, కృతజ్ఞత అన్నీ కలిసిపోయి కనిపిస్తాయి. అప్పటి నుంచి తేజ తీసే ప్రతి సినిమా కథ, ముందుగా భరణికి వినిపించడం కూడా ఓ సెంటిమెంట్‌గా మారిపోయిందట.
ఇలాంటి సంఘటనలు చూస్తే అప్పటి టాలీవుడ్‌లో మాటకు, సంబంధాలకు ఎంత విలువ ఉండేదో అర్థమవుతుంది. డబ్బుకంటే బంధాలను ఎక్కువగా చూసే వ్యక్తులు ఉండేవారని తెలుస్తుంది. తనికెళ్ల భరణి కూడా అలాంటి వారిలో ముందుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఉచితంగా పనిచేయడానికి కూడా ఆయన వెనుకాడరని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. అందుకే ఆయనను కేవలం నటుడిగా కాదు.. మార్గదర్శిగా, గురువుగా కూడా గౌరవిస్తారు.
