Begin typing your search above and press return to search.

ఆస్కార్ బ‌రిలో టాప్ 10 త‌మిళ సినిమాలు ఫెయిల్?

దేవ మగన్, నాయకన్, అంజలి, తేవర్ మగన్, కురుతిపునల్, ఇండియన్, జీన్స్, హే రామ్, విసరణై, కూజంగల్ వంటి చిత్రాలు కొన్నేళ్లుగా తమిళం నుండి భార‌త‌దేశం త‌ర‌పున‌ అధికారిక ఎంట్రీలుగా నిలిచాయి

By:  Tupaki Desk   |   29 Sep 2023 2:45 AM GMT
ఆస్కార్ బ‌రిలో టాప్ 10 త‌మిళ సినిమాలు ఫెయిల్?
X

2024 ఆస్కార్ బ‌రిలో భార‌త‌దేశం త‌ర‌పున నిలిచే చిత్రాలు ఏవో ఇంత‌కుముందే వెల్ల‌డైంది. మలయాళ చిత్రం 2018, ఎవ్రీ వ‌న్ ఈజ్ ఈ హీరో చిత్రాలు 'ఉత్తమ అంత‌ర్జాతీయ‌ ఫీచర్ ఫిలిం' కేటగిరీ కింద 96వ అకాడమీ అవార్డ్స్‌కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపిక‌య్యాయి. చివరి రౌండ్‌కు చేరుకున్న 22 చిత్రాల నుండి ఇవి ఎంపికయ్యాయి. షార్ట్‌లిస్ట్ అయిన వాటిలో తమిళ చిత్రాలకు తగిన ప్రాతినిధ్యం ఉంది. తమిళ చిత్రాలలో విదుతలై పార్ట్ 1, మామన్నన్, వాతి, ఆగష్టు 16, 1947 చిత్రాలు ఉన్నాయి. తమిళం కాకుండా తుది జాబితాలో 11 హిందీ చిత్రాలు, 4 తెలుగు చిత్రాలు, 2 మరాఠీ చిత్రాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చివ‌రి స్క్రుటినీలో మ‌ల‌యాళం నుంచి 2018 సినిమా ఒక్క‌టే రేసులో నిలిచింది.

నిజానికి భారతదేశం ఈ ప్రతిష్టాత్మక అవార్డు(ఉత్త‌మ అత‌ర్జాతీయ ఫీచ‌ర్ ఫిలిం)ను ఎన్నడూ గెలుచుకోలేదు. మదర్ ఇండియా, సలామ్ బాంబే, లగాన్ మాత్రమే నామినేషన్ జాబితాలో చేరాయి. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం స‌హా ఏ భాషా చిత్రం ఉత్త‌మ ఫీచ‌ర్ ఫిలింగా ఆస్కార్ ని గెలుచుకున్న‌ది లేదు. కానీ ఈసారి బ‌రిలో నిలిచాయి.

దేవ మగన్, నాయకన్, అంజలి, తేవర్ మగన్, కురుతిపునల్, ఇండియన్, జీన్స్, హే రామ్, విసరణై, కూజంగల్ వంటి చిత్రాలు కొన్నేళ్లుగా తమిళం నుండి భార‌త‌దేశం త‌ర‌పున‌ అధికారిక ఎంట్రీలుగా నిలిచాయి త‌ప్ప పుర‌స్కారాల్ని గెలుచుకోలేక‌పోయాయి. ఈ 10 చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్ల కోసం గ‌తంలో ఎంపికయినా కానీ ఆశించిన స‌క్సెస్ ని ద‌క్కించుకోలేక‌పోయాయి.

తెలుగు నుంచి ఆస్కార్ బ‌రిలోకి:

రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా నుంచి నాటు నాటు గీతం ఆస్కార్ ఉత్త‌మ ఒరిజిన‌ల్ సాంగ్ గా అవార్డును గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. 2024లో గౌరవనీయమైన ఆస్కార్ నామినేషన్ల కోసం మరో రెండు తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. నాని న‌టించిన దసరా -న‌టుడు వేణు తెర‌కెక్కించిన బలగం చిత్రాలు ఆస్కార్ బ‌రికి వెళుతున్నాయి. దసరా అనేది ప్రేక్షకులను సీటు అంచున కూచోబెట్టిన‌ ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్. బలగం అనేది సామాన్య ప్ర‌జ‌ల బతుకు చిత్రానికి సంబంధించిన సినిమా. దసరా-బలగం రెండూ భారతదేశం స‌హా విదేశాలలో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యప‌ర‌మైన‌ విజయాన్ని అందుకున్నాయి. వారి వినూత్నమైన కథాకథనం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఆకట్టుకునే సంగీతంతో ప్రశంసలు ద‌క్కాయి. ఆస్కార్‌కి అధికారిక ప్రవేశం కోసం ప్ర‌య‌త్నించిన‌ 22 చిత్రాల జాబితాలో ఇవి ఉన్నాయి. చెన్నైలో చిత్రనిర్మాత గిరీష్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యుల కమిటీ పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.