Begin typing your search above and press return to search.

మనోళ్లను ఫాలో అవుతున్న కోలీవుడ్ లెజెండ్స్‌

ఇప్పుడు కోలీవుడ్‌ కు చెందిన పలువురు స్టార్‌ డైరెక్టర్స్‌, లెజెండ్రీ డైరెక్టర్స్ కూడా ప్రొడక్షన్‌ వైపు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   13 March 2024 7:06 AM GMT
మనోళ్లను ఫాలో అవుతున్న కోలీవుడ్ లెజెండ్స్‌
X

ఒకప్పుడు సినిమా స్టార్స్‌ ఆదాయం విషయంలో సింగిల్ హ్యాండ్‌ అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు నాలుగు చేతుల సంపాదించేస్తున్నారు. హీరోలు నటించడంతో పాటు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సంపాదించడంతో పాటు ఇంకా పలు రకాలుగా తమ ఇమేజ్ ను ఉపయోగించుకుని సంపాదించేస్తున్నారు.

అలాగే దర్శకులు కూడా తమ ఇమేజ్ ను ఉపయోగించుకుని సాధ్యం అయినంత ఎక్కువ సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్‌ దర్శకుల యొక్క బ్రాండ్ ఇమేజ్ కారణంగా చిన్న సినిమాలకు మంచి బిజినెస్ అవ్వడంతో పాటు మంచి పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే చిన్న సినిమాలకు పెద్ద దర్శకులు భాగస్వామ్యులుగా ఉంటున్నారు.

కొందరు నిర్మాతలు పెట్టుబడి పెట్టకుండానే సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. మరి కొందరు కథ మరియు స్క్రీన్ ప్లే అందించడం, దర్శకత్వంలో తమ మార్క్ చూపించడం వంటి కారణాల వల్ల మేకింగ్ మరియు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. టాలీవుడ్‌ కు చెందిన సుకుమార్ తో పాటు పలువురు దర్శకులు తమ బ్రాండ్ వాల్యూతో సినిమాల నిర్మాణంలో అడుగు పెట్టారు.

ఇప్పుడు కోలీవుడ్‌ కు చెందిన పలువురు స్టార్‌ డైరెక్టర్స్‌, లెజెండ్రీ డైరెక్టర్స్ కూడా ప్రొడక్షన్‌ వైపు చూస్తున్నారు. కొందరు చాలా కాలంగా నిర్మాణంలో ఉండగా మరి కొందరు మాత్రం ఈ మధ్య కాలంలో నిర్మాణంలో అడుగు పెట్టి కొత్త సంపాదన మొదలు పెట్టారు.

దర్శకుడు మణిరత్నం చాలా ఏళ్లుగా నిర్మాణ సంస్థ రన్ చేస్తున్నారు. ఆయన ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల మేకింగ్ పై దృష్టి పెట్టారు. ఇతర దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. ఇంకా శంకర్ కూడా గతంలోనే నిర్మాణం మొదలు పెట్టి ఇతర దర్శకులకు అవకాశాలు ఇచ్చిన విషయం తెల్సిందే.

ఈ మధ్య కాలంలో లోకేష్‌ కనగరాజ్, అట్లీ, నెల్సన్‌ దిలీప్‌.. ఇలా మరి కొందరు ప్రముఖ దర్శకులు కూడా సినిమాల నిర్మాణం వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఒక వైపు తమ సినిమాలు చేసుకుంటూనే మరో వైపు నిర్మాణం పై కూడా దృష్టి పెట్టిన ఈ దర్శకుల్లో ఇప్పటికే కొందరు మంచి విజయాలను అందుకోగా మరి కొందరి ప్రాజెక్ట్‌ లు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.