ఎట్టకేలకు జై భీమ్ కు గౌరవం దక్కింది
తమిళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన వారిని గుర్తిస్తూ ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని చెప్పారు.
By: Sravani Lakshmi Srungarapu | 30 Jan 2026 4:23 PM ISTతమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అధికారికంగా ప్రకటించింది. 2016 నుంచి 2022 మధ్య రిలీజైన తమిళ సినిమాలకు సంబంధించి ఈ అవార్డులను జ్యూరీ అనౌన్స్ చేసింది. తమిళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభను కనబరిచిన వారిని గుర్తిస్తూ ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని చెప్పారు.
స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన జై భీమ్
అయితే ఈ అవార్డుల్లో సూర్య హీరోగా నటించిన జై భీమ్ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ సినిమాకు ఏకంగా ఏడు కేటగిరీల్లో అవార్డులు వరించాయి. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ విలన్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ విభాగాల్లో జై భీమ్ కు అవార్డులు దక్కినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
నేషనల్ అవార్డుల్లో జై భీమ్ కు దక్కని చోటు
సూర్య హీరోగా టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజైంది. రిలీజైన వెంటనే జై భీమ్ కు ఆడియన్స్ నుంచి గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మూవీ చూసిన ఎంతో మంది ఈ సినిమా నేషనల్ అవార్డుల్లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పారు. తీరా చూస్తే ఈ సినిమాకు ఏ విభాగంలోనూ నేషనల్ అవార్డు దక్కలేదు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు దక్కకపోవడంపై ఎంతోమంది సెలబ్రిటీలు సైతం పెదవి విరిచి, తమ అసంతృప్తిని వెల్లిబుచ్చారు.
నేషనల్ అవార్డు దక్కకపోవడం వల్లేనా?
అయితే నేషనల్ అవార్డుల్లో తమ సినిమాను పట్టించుకోలేదనే కారణంతోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడీ సినిమాకు ఇన్ని అవార్డులను ఇచ్చిందా అనేది సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ గా మారింది. అయితే జై భీమ్ మూవీలో కొన్ని సీన్ల వలనే ఆ సినిమాకు నేషనల్ అవార్డు రాలేదని అప్పట్లో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా ఇప్పుడు జై భీమ్ కు దక్కిన గౌరవం ఆ సినిమాకు దక్కాల్సిందే. అంత గొప్ప సినిమా అది. అందుకే ఈ విషయంలో ఎవరూ పెద్దగా కల్పించుకుని మాట్లాడి విమర్శలు చేయడం లేదు.
కాగా ఈ అవార్డుల్లో 2016లో ఉత్తమ చిత్రంగా మా నగరం నిలిస్తే, 2017 ఉత్తమ చిత్రంగా ఆరం, 2018 బెస్ట్ సినిమాగా పరియేరుమ్ పెరుమాల్, 2019 బెస్ట్ మూవీగా అసురన్, 2020 బెస్ట్ సినిమాగా కూజంగల్, 2021 సంవత్సరానికి గానూ జై భీమ్, 2022 సంవత్సరానికి గానూ గార్గి బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. ఇక ఉత్తమ నటులుగా విజయ్ సేతుపతి, కార్తి, ధనుష్, పార్తిబన్, సూర్య, ఆర్య, విక్రమ ప్రభు కు అవార్డులు దక్కగా, ఉత్తమ నటీమణులుగా సాయి పల్లవి, లిజోమోల్, కీర్తి సురేష్, జ్యోతిక, నయనతార, మంజువారియర్, అపర్ణ బాలమురళి అవార్డులను దక్కించుకున్నారు.
