సూర్య, లోకేష్ బాక్సాఫీస్.. అసలు తేడా ఇది!
తమిళ సినిమా రిలీజ్ అయితే ముందుగా సొంత రాష్ట్రం వసూళ్ల గురించి మాట్లాడుకుంటారు.
By: M Prashanth | 18 Aug 2026 4:15 PM ISTతమిళ సినిమా రిలీజ్ అయితే ముందుగా సొంత రాష్ట్రం వసూళ్ల గురించి మాట్లాడుకుంటారు. ఆ తర్వాతే మిగతా మార్కెట్ల లెక్కలు బయటకు వస్తాయి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కొన్ని తమిళ చిత్రాలకు సొంత మార్కెట్ కంటే మన దగ్గరే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. సూర్య లేటెస్ట్ మూవీ 'విశ్వనాథ్ అండ్ సన్స్' దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమా ఫస్ట్ డే తమిళనాడును మించి తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ గ్రాస్ రాబట్టింది.
అంచనాల ప్రకారం వీకెండ్ ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో 27.25 కోట్లు వస్తే, తమిళనాడులో 26.25 కోట్లతో ఆగిపోయింది. సూర్యకు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ఈరోజు వచ్చింది కాదు. దానికి తోడు దర్శకుడు వెంకీ అట్లూరి మన వాడే కావడం ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. కథలో ఉన్న ఫ్యామిలీ ఎమోషన్స్ కు ఇక్కడి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ మూవీ అంచనాల ప్రకారం తమిళనాడులో 2.75 కోట్లు మాత్రమే రాబడితే, తెలుగు నాట ఏకంగా 4 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అక్కడ మౌత్ టాక్ మరీ భారీగా లేకపోవడం కూడా తమిళనాడు వసూళ్లపై ప్రభావం చూపించింది. అయితే సూర్య సినిమా మాత్రమే కాదు లోకేష్ కనగరాజ్ హీరోగా చేసిన 'DC' మూవీది కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినా పది రోజుల రన్ లో తమిళనాడులో అంచనాల ప్రకారం 18.75 కోట్ల గ్రాస్ వస్తే, మన దగ్గర 16.50 కోట్లు వచ్చింది. లోకేష్ కు రెగ్యులర్ గా హీరో ఇమేజ్ లేదు.
ఖైదీ, విక్రమ్, లియో లాంటి క్రేజీ ప్రాజెక్టులతో డైరెక్టర్ గా అతను సంపాదించుకున్న ఇమేజ్ ఈ సినిమాకు కూడా ప్లస్ అయింది. మన దగ్గర ఆ దర్శకుడికి ఉన్న బజ్ ఇక్కడి కలెక్షన్స్ రూపంలో క్లియర్ గా కనిపించింది. ఈ రెండు చిత్రాల రిజల్ట్ చూసి ప్రతి తమిళ సినిమా తెలుగులో ఇలాగే ఆడేస్తుందని ఫిక్స్ అవ్వడానికి లేదు. రీసెంట్ గా వచ్చిన ధనుష్ 'కారా' విషయమే తీసుకుంటే, తమిళనాడులో అంచనాల ప్రకారం 28.5 కోట్లు రాబట్టిన ఆ సినిమా ఇక్కడ 8.5 కోట్ల దగ్గరే ఆగింది.
దీన్ని బట్టి భాష కంటే ముందు కథ ఎంత ఈజీగా కనెక్ట్ అవుతోంది, అందులో పని చేసిన హీరో లేదా డైరెక్టర్ కు ఉన్న మార్కెట్ ఎంత అనేదే అసలు లెక్క. డబ్ చేసి వదిలేస్తే తెలుగు జనాలు థియేటర్లకు క్యూ కట్టేస్తారనే నమ్మకం ఇప్పుడు లేదు. ఒకప్పుడు తమిళ నిర్మాతలకు తెలుగు రైట్స్ అమ్మడం అంటే ఒక అదనపు బోనస్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు అవే వసూళ్లు వాళ్ల టోటల్ బిజినెస్ లో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాలను కేవలం పేరు మార్చి వదిలేయకుండా ఇక్కడికి వచ్చి నేరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
