Begin typing your search above and press return to search.

ప్రదీప్ రంగనాథన్‌కు 50 కోట్లా?

వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు అందించిన హీరోతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎగబడడంలో ఆశ్చర్యమేమీ లేదు.

By:  Garuda Media   |   3 April 2026 12:00 AM IST
ప్రదీప్ రంగనాథన్‌కు 50 కోట్లా?
X

వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు అందించిన హీరోతో సినిమా చేయడానికి నిర్మాతలు ఎగబడడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆ హీరోను లాక్ చేయడం కోసం మార్కెట్ స్థాయిని మించి, కొంచెం ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తారు. అలా అని ఆ హీరో మీద పెట్టగలిగే గరిష్ట బడ్జెట్ మొత్తాన్ని కేవలం పారితోషకం రూపంలో ఇస్తారంటే వినడానికి విడ్డూరంగా అనిపించక మానదు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తమిళ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్‌కు ఏకంగా రూ.50 కోట్లు పారితోషకంగా ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇలాగే ఇప్పుడు అందరికీ కామెడీగా తోస్తోంది. ప్రదీప్ ఇప్పటికే మైత్రీ సంస్థలో ‘డ్యూడ్’ మూవీ చేశాడు. ఆ సినిమా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. కానీ షేర్ రూ.50 కోట్ల లోపే వచ్చింది. సినిమాకు రూ.50 కోట్ల పైగానే ఖర్చయింది. ఆ చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ రూ.15 కోట్ల మేర పారితోషకం అందుకున్నాడు.

అలాంటిది ఇప్పుడు దాని మీద మూడు రెట్ల పారితోషకంతో అతను మైత్రి సంస్థలో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్క్రీన్ ప్లే మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ సీనియర్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి.. ప్రదీప్ హీరోగా మైతీ సంస్థలో సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. తనకు తమిళంలో విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ.. మరోసారి తెలుగు బేనర్లో, పైగా తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి ప్రదీప్ ఒప్పుకోవడం విశేషమే. ఈ చిత్రానికి ‘డ్యూడ్’ కంటే ఎక్కువ పారితోషకం తీసుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. మహా అయితే రూ.20-25 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటాడేమో.

కానీ ఏకంగా రూ.50 కోట్లు అని తమిళ మీడియా జనాలు రిపోర్ట్ చేస్తుండడమే విడ్డూరం. పేరున్న తమిళ పీఆర్, క్రిటిక్ హ్యాండిల్స్ అన్నీ ప్రదీప్ రెమ్యూనరేషన్ గురించి టెంప్లేట్ ట్వీట్లు వేసేస్తున్నాయి. తమిళ హీరో కోసం తెలుగు నిర్మాతలు వెంపర్లాడుతున్నారనే ఫీలింగ్ తెప్పించడానికే ఈ పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే.. తమిళంలో దర్శకులు, నిర్మాతల పనితనం తగ్గిపోవడంతో అక్కడి హీరోలు తెలుగు డైరెక్టర్లు, నిర్మాతల వైపు చూస్తున్న మాట వాస్తవం. ఇది గుర్తించకుండా పారితోషకం గురించి ఇలా ఫేక్ వార్తలు సృష్టించడమే విచిత్రం.