బాబోయ్.. సీనియర్ డైరెక్టర్లు
తమిళ సినిమాల పరిస్థితి చాలా ఏళ్ల నుంచి ఏమంత గొప్పగా లేదు. ఒకప్పుడు ఓవైపు కమర్షియల్ హిట్లతో, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తమిళ దర్శకులు అద్భుతాలు చేసేవారు.
By: Tupaki Desk | 7 Jun 2025 5:00 PM ISTతమిళ సినిమాల పరిస్థితి చాలా ఏళ్ల నుంచి ఏమంత గొప్పగా లేదు. ఒకప్పుడు ఓవైపు కమర్షియల్ హిట్లతో, మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తమిళ దర్శకులు అద్భుతాలు చేసేవారు. ఆ భాషా చిత్రాలకు తెలుగులోనూ గొప్ప ఆదరణ దక్కేది. కానీ కొన్నేళ్ల నుంచి తమిళ చిత్రాల ప్రమాణాలు బాగా పడిపోయాయి. ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన డైరెక్టర్లు.. ఇప్పుడు తీస్తున్న సినిమాలు చూసి ప్రేక్షకులు బెంబేలెత్తిపోతున్నారు.
90వ దశకంలో జెంటిల్‌మన్‌తో మొదలుపెట్టి వరుస బ్లాక్‌బస్టర్లతో దక్షిణాది కమర్షియల్ సినిమా రూపు రేఖలు మార్చిన శంకర్.. గత దశాబ్ద కాలంలో ఎలాంటి డిజాస్టర్లు అందించాడో తెలిసిందే. అందులోనూ ఆయన చివరి రెండు చిత్రాలు గేమ్ చేంజర్, ఇండియన్-2 అయితే.. ప్రేక్షకుల తలలు బొప్పికట్టేలా చేశాయి. ఇక శంకర్ సినిమాలు మానేస్తే మేలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.
శంకర్ తరహాలోనే ప్రయోగాత్మక కథలకు కమర్షియల్ హంగులు అంది భారీ విజయాలందుకున్న మురుగదాస్ సైతం కొన్నేళ్లుగా పేలవమైన సినిమాలు తీస్తున్నాడు. స్పైడర్, దర్బార్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అయ్యాయి. ఆయన్నుంచి ఈ ఏడాది వచ్చిన సికిందర్ దారుణమైన ఫలితాన్నందుకుంది. మురుగదాస్ ఇక కోలుకుంటాడనే ఆశలేమీ కనిపించడం లేదు. మదరాసి మీద కూడా అంచనాలు తగ్గిపోయాయి.
ఇక లేటెస్ట్‌గా మణిరత్నం వీరి బాటలోనే థగ్ లైఫ్‌తో పెద్ద డిజాస్టర్ తినడానికి రెడీ అయ్యాడు. మణిరత్నం గతంలో ఫ్లాప్ సినిమాలు తీసినా.. అవి ఔట్ డేటెడ్ అనిపించేవి కావు. ఆయన ట్రెండును అనుసరించే సాగుతున్నారని అనిపించేది. ఇంకా కొత్త ఆలోచనలు చేస్తున్నట్లే కనిపించేవారు. కానీ థగ్ లైఫ్ మాత్రం పరమ రొటీన్‌గా అనిపించి, ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. చివరికి మణిరత్నం కూడా పూర్తిగా లయ కోల్పోయినట్లు కనిపించడంతో తమిళ లెజెండరీ డైరెక్టర్లకు ఏమైంది అని ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఈ దర్శకులందరికీ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వాళ్ల సినిమాలకు ఒకప్పుడు బ్రహ్మరథం పట్టారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ల సినిమాలంటే బెంబేలెత్తిపోతున్నారు.
