Begin typing your search above and press return to search.

ఎలాంటి క‌ట్ లేకుండా రోల్ చేసి లాక్ చేసిన సీన్!

బాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వాణిజ్యపరంగా విజయం సాధించకపోయినా? కాలక్రమేణా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుని కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోతుంటాయి.

By:  Srikanth Kontham   |   24 May 2026 11:00 PM IST
ఎలాంటి క‌ట్ లేకుండా రోల్ చేసి లాక్ చేసిన సీన్!
X

బాలీవుడ్ లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో వాణిజ్యపరంగా విజయం సాధించకపోయినా? కాలక్రమేణా ప్రేక్షకుల హృదయాల్లో బలమైన స్థానాన్ని సంపాదించుకుని కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోతుంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన `తమాషా` ఒకటి. రణబీర్ కపూర్, దీపికా పదుకొణె జంట‌గా నటించిన చిత్రం మానవ సంబంధాలలోని సంక్లిష్టతలను , స్వీయ అన్వేషణను అద్భుతంగా ఆవిష్కరించింది. ఈ సినిమాలోని భావోద్వేగాలు, సన్నివేశాలు నేటికీ సినీ ప్రియులలో నిరంతరం చర్చనీయాంశమవుతుంటాయి.

తాజాగా ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సీన్ (బిహైండ్ ది సీన్స్) గురించి దర్శకుడు ఇంతియాజ్ అలీ పంచుకున్నారు. వెండితెరపై ప్రేక్షకులను ఎంతగానో? ఆకట్టుకున్న ఓ సుందరమైన సన్నివేశం అసలు సినిమా స్క్రిప్ట్‌లోనే లేదని వెల్లడించారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా? లొకేషన్‌లోని వాతావరణం, నటీనటుల మధ్య సహజ సిద్ధమైన అనుబంధం ఆధారంగా ఆ షాట్‌ను చిత్రీకరించినట్లు అలీ తెలిపారు. అది ఎంతో నిజాయితీతో కూడుకున్నది కాబట్టే ఫైనల్ కట్‌లో అలాగే ఉంచేసినట్లు వెల్ల‌డించారు. ఇంత‌కీ ఏంటా స‌న్నివేశం అంటే?..

సినిమాలో వేద్ (రణబీర్ కపూర్), తారా (దీపికా పదుకొణె) ఫ్రెంచ్ దీవి అయిన కార్సికా పర్యటనలో ఉన్నప్పుడు కొండ శిఖరంపై కూర్చుని సూర్యాస్తమయాన్ని వీక్షించే సీన్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా, కేవలం నిశ్శ బ్దంతో నిండి ఉండే ఆ సుదీర్ఘమైన షాట్ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఆ కొండపైకి వెళ్లడం ఎంతో ప్రమాదకరమైనది కావడంతో? మొదట అక్కడ షూటింగ్ చేయడానికి టెక్నికల్ బృందం అనుమతించలేదు.

లొకేషన్ ప్రమాదకరంగా ఉన్నా? ఆ అనుభూతిని కెమెరాలో బంధించాలనే తపనతో ఇంతియాజ్ అలీ స్వయంగా మొదట ఆ కొండపైకి ఎక్కారు.

అక్కడ నుంచి కింద ఉన్న రణబీర్ కపూర్‌ను పైకి రమ్మని పిలిచారు. అయితే ఆ ఎత్తును చూసి భయపడిన రణబీర్ అంత పైకి రాలేను సార్ అని నిరాకరించారట. కానీ ఇంతియాజ్ అలీ పట్టుబట్టడంతో నెమ్మదిగా కొద్దిగా ముందుకు వచ్చి ఆ ప్రమాదకరమైన అంచున రణబీర్ కూర్చున్నాడు. ఆ తర్వాత దీపికా పదుకొణె కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో దర్శకుడు వారికి ఎలాంటి డైలాగులు కానీ, ప్రత్యేకమైన హావభావాలు కానీ సూచించలేదు. కేవలం ఆ ప్రశాంతమైన వాతావరణంలో అలా కూర్చోమని మాత్రమే చెప్పారు. రణబీర్, దీపికలు ఇద్దరూ ఆ క్షణంలోని భావాన్ని, ప్రకృతి అందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించారు.

వారిద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోయినా, వారి ముఖాల్లోని ప్రశాంతతను చూసిన ఇంతియాజ్ అలీ ఎలాంటి కట్స్ చెప్పకుండా కెమెరాను రోల్ చేస్తూనే వెళ్లారు. అలా ఎలాంటి స్క్రిప్ట్, ముందస్తు రిహార్సల్స్ లేకుండా పుట్టిన ఆ ఒకే ఒక్క షాట్ `తమాషా` సినిమాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన దృశ్యంగా మారింది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఇంతియాజ్ అలీ మేకింగ్ స్టైల్ సినిమాను ప్రత్యేకంగా నిల‌బెట్టాయి.