తమన్నా రెడీగా ఉన్నా.. మేకర్స్ రెడీగా ఉన్నారా!
తెలుగులో ఎక్కువ సినిమాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తమన్నా ఇటీవల ప్రియుడు విజయ్ వర్మ నుంచి దూరం అయింది.
By: Tupaki Desk | 3 April 2025 10:00 PM ISTమిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. సాధారణంగా హీరోయిన్స్ రెండు దశాబ్దాల సినీ కెరీర్‌ను కొనసాగించడం అనేది అరుదుగా చూస్తూ ఉంటాం. ఇన్నాళ్లు అయినా తమన్నా ఇప్పటికీ బిజీగానే ఉంది. సౌత్ ఇండియన్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ, వేరు వేరు భాషల్లో వెబ్ సిరీస్‌లు చేస్తూ మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంది. ఆ మధ్య తమన్నా కాస్త స్లో అయింది, కాస్త డల్ అయింది, ఆమె పని అయిపోయినట్లే అనే కామెంట్స్ వచ్చాయి. కానీ తమన్నా అనూహ్యంగా ఓదెల 2 సినిమాతో మరోసారి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఓదెల 2 సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. మొదటి సారి తమన్నాను అఘోరి పాత్రలో ఈ సినిమాలో చూడబోతున్నాం. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈమధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్‌గా కంటే ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా తమన్నాను సినిమాల్లో చూశాం. కానీ ముందు ముందు రెగ్యులర్‌గా సినిమాల్లో హీరోయిన్‌గా తమన్నాను చూడబోతున్నామట. ఈ విషయాన్ని స్వయంగా ఓదెల 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.
తెలుగులో ఎక్కువ సినిమాలు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తమన్నా ఇటీవల ప్రియుడు విజయ్ వర్మ నుంచి దూరం అయింది. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తమన్నా సినిమాలతో బిజీ కావాలని ఆశ పడుతుంది. ముఖ్యంగా తెలుగులో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం ఈమె ప్రయత్నాలు చేస్తుంది. తమన్నా ఈ స్థాయి స్టార్‌డం దక్కించుకోవడంకు కచ్చితంగా తెలుగు సినిమాలు కారణం అనడంలో సందేహం లేదు. అయితే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ మేకర్స్ తమన్నాతో అప్పటి మాదిరిగా సినిమాలు చేయడంకు, స్టార్ హీరోలు గతంలో మాదిరిగా ఆమెతో కలిసి సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారా అనేది అనుమానమే.
తమన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నా ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆమెకు గ్రీన్ సిగ్నల్ రావడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు తప్ప స్టార్ హీరోలకు జోడీగా తమన్నాకు అవకాశాలు దక్కడం సాధ్యం కాకపోవచ్చు. ఒక వేళ సీనియర్ హీరోలకు ఈమె జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంటుందేమో చూడాలి. చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో ఇప్పటికే ఈమె నటించిన కారణంగా ముందు ముందు యంగ్ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కడం అనేది దాదాపు అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే తమన్నాకు ప్రేక్షకుల్లో ఇప్పటికి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉంది అనడంలో సందేహం లేదు.
