టబు కూడా వచ్చేసింది.. ఏం ప్లాన్ చేశావ్ పూరి?
పూరి జగన్నాథ్… ఒకప్పుడు టాలీవుడ్‌లో పవర్ఫుల్ కథలతో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్.
By: Tupaki Desk | 10 April 2025 5:15 PM ISTపూరి జగన్నాథ్… ఒకప్పుడు టాలీవుడ్‌లో పవర్ఫుల్ కథలతో సంచలనాలు సృష్టించిన డైరెక్టర్. ఇడియట్, పోకిరి, టెంపర్, బిజినెస్ మాన్ లాంటి హిట్లు ఇచ్చిన పురికి ఇప్పుడు లోకల్ గా అంతగా కలిసి రావడం లేదు. లేటెస్ట్‌గా వరుస పరాజయాలతో పూరి కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' వంటి సినిమాలు భారీ డిజాస్టర్ అయ్యాయి. అలాంటి టైంలో పూరి తిరిగి తన సత్తా చూపించేందుకు మళ్లీ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.
ఇప్పుడు పూరి చేస్తున్న కొత్త సినిమా కొంచెం డిఫరెంట్ అండ్ డేరింగ్ గా మారుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించనున్నాడు. విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన సేతుపతి ఇలా తెలుగు దర్శకుడితో చేయడమంటే మామూలు విషయం కాదు. సాధారణంగా ఆయనకు కథ నచ్చితేనే ఒప్పుకుంటాడు. పైగా రెమ్యునరేషన్ గురించి అస్సలు పట్టించుకోని వ్యక్తి. కథ ఎంత బలంగా ఉంటే.. ఎంత డిఫరెంట్‌గా ఉంటే.. అంత తక్కువలో కూడా ఒప్పుకునే నమ్మకాన్ని ఆయన కలిగిస్తారు.
మరోవైపు ఈ సినిమాలో కీలక పాత్రకు టబు కూడా సైన్ చేసినట్లు అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో టబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టబు ఇటీవలి కాలంలో ఏడాదికి కేవలం ఒకటి లేదా రెండు పాత్రలకే ఓకే చెబుతోంది. కథ నచ్చకపోతే ఎక్కడి నుండి వచ్చిన ప్రాజెక్ట్ అయినా రిజెక్ట్ చేస్తుంది.
ఇప్పుడు ఆమె పూరి ప్రాజెక్ట్‌లో నెగటివ్ షేడ్స్ ఉన్న డైనమిక్ రోల్ చేయబోతుందని సమాచారం. అంటే పూరి స్క్రిప్ట్ మామూలుగా ఉండదని అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పూరి స్థానిక హీరోలను కూడా ఒప్పించలేని పరిస్థితిలో ఉండగా, ఈ స్థాయి నటీనటులను ఎంపిక చేయడం వెనక ఆయన దగ్గర బలమైన కంటెంట్, క్రేజీ స్క్రీన్ ప్లే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జూన్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి, టబులాంటి టాలెంటెడ్ నటులు ఉన్న ప్రాజెక్ట్ మీద ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. కథపైనే కాకుండా పాత్రలపై మంచి బలమున్నప్పుడు మాత్రమే ఇలాంటి వాళ్లు ఓకే చెబుతారు. ఇది పూరి మళ్లీ తన మార్క్ స్క్రిప్ట్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం అనే నమ్మకాన్ని కలిగిస్తోంది. మరి ఈసారి పూరి ఖచ్చితంగా ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి.
