Begin typing your search above and press return to search.

ఈ న‌టుడు విమానాలు న‌డుపుతాడు.. దంత వైద్యంలో స్పెష‌లిస్ట్!

చిన్న పిల్ల‌ల్లో అరుదైన రుగ్మ‌త గురించి చెబుతూ.. పిల్ల‌ల‌తో ప్ర‌వ‌ర్తించాల్సిన తీరుపై ఒక మాస్ట‌ర్ క్లాస్ తీస్కున్నాడు అమీర్ ఖాన్.

By:  Sivaji Kontham   |   17 Jun 2026 10:02 AM IST
ఈ న‌టుడు విమానాలు న‌డుపుతాడు.. దంత వైద్యంలో స్పెష‌లిస్ట్!
X

చిన్న పిల్ల‌ల్లో అరుదైన రుగ్మ‌త గురించి చెబుతూ.. పిల్ల‌ల‌తో ప్ర‌వ‌ర్తించాల్సిన తీరుపై ఒక మాస్ట‌ర్ క్లాస్ తీస్కున్నాడు అమీర్ ఖాన్. నిజానికి `తారే జ‌మీన్ ప‌ర్` సినిమాతో అత‌డు ఇచ్చిన సందేశం ప్ర‌పంచాన్ని విస్మ‌య‌ప‌రిచింది. అది ఒక సాంస్కృతిక మార్పుకు నాందిగా చ‌ర్చించుకున్నారు. పిల్లల పెంపకం.. విద్యా వ్యవస్థలోని లోపాలు .. లెర్నింగ్ డిజేబిలిటీస్ (నేర్చుకోవడంలో ఇబ్బందులు) ఉన్న పిల్లల విష‌యంలో సమాజం ప్రదర్శించాల్సిన బాధ్యతపై ఈ సినిమా విస్తృతమైన చర్చకు తెర తీసింది. ఈ చిత్రంతోనే ఇద్దరు బాల నటులు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా పరిచయమయ్యారు. వారిలో ఒకరు ప్రధాన పాత్రధారి దర్శీల్ సఫారీ కాగా.. మరొకరు అతడి అన్నయ్యగా నటించిన సాచేత్ ఇంజనీర్.

ఈ చిత్రంలో సాచేత్ ఇంజనీర్ పోషించిన `యోహాన్ అవస్థి` పాత్ర చాలా ఇంపార్టెంట్ రోల్. కథానాయకుడు ఈషాన్ అవస్థి (దర్శీల్ సఫారీ) చదువులో వెనుకబడి తండ్రి కోపానికి గురవుతుంటే అతడికి పూర్తి భిన్నంగా యోహాన్ చదువులోనూ, ఆటల్లోనూ ఎప్పుడూ టాపర్‌గా నిలుస్తాడు. అయినా తమ్ముడిని అర్థం చేసుకుని ఎంతో ప్రేమను, ఆప్యాయతను చూపే ఆదర్శవంతమైన అన్నయ్యగా యోహాన్ పాత్ర కనిపిస్తుంది. ఈషాన్ మానసిక స్థితిని అర్థం చేసుకుని.. అతడిని సముదాయించే యోహాన్ పాత్ర ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.

సినిమా ఘనవిజయం సాధించినా సాచేత్ ఇంజనీర్ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్‌లో కొనసాగే అవకాశం ఉన్నా.. తన ఉన్నత విద్యాభ్యాసానికే అతడు మొదటి ప్రాధాన్యతనిచ్చాడు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ నటుడు ప్రస్తుతం లండన్ (యూకే)లో స్థిరపడి అక్కడ ఒక విజయవంతమైన డెంటిస్ట్ (దంతవైద్యుడు)గా తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. సినిమా రంగంలో మెరిసిన ఒక నటుడు, వైద్య రంగంలో రాణించడం నిజంగా విశేషం.

అయితే సాచేత్ ప్రతిభ దంత వైద్యంతోనే ఆగిపోలేదు. అతడు తన నిజ జీవితంలో వైద్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు పైలట్ కావాలనే తన కల వైపు కూడా అడుగులు వేశాడు. ఇప్పటికే లైసెన్స్ పొందిన పైలట్‌గా ఎదగడానికి అవసరమైన శిక్షణను పూర్తి చేస్తూ.. విమానాలను నడుపుతున్నాడు. ఈ విధంగా ఒకవైపు ప్రజల చిరునవ్వులను కాపాడే వైద్యుడిగా.. మరోవైపు ఆకాశంలో విమానాలలో విహ‌రించే పైలట్‌గా సాచేత్ అద్భుతమైన ప్రతిభను చాటుకుంటున్నాడు.

రీల్ లైఫ్‌లో చదువులో రాణించే రోల్ మోడల్ విద్యార్థిగా కనిపించిన సాచేత్... రియల్ లైఫ్‌లో కూడా అదే స్థాయి క్రమశిక్షణతో డెంటిస్ట్ కం పైలట్‌గా రెండు భిన్నమైన అత్యున్నత వృత్తులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. `తారే జమీన్ పర్` సినిమాలో ఆదర్శవంతమైన అన్నయ్యగా అలరించిన ఈ కుర్రాడు ఇప్పుడు నిజ జీవితంలో కూడా ద్విపాత్రాభినయం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. సాచేత్ తిరిగి న‌ట‌న‌లోకి వ‌స్తాడా లేదా? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి.