ఇన్‌ఫ్లూయెన్సర్ ఆత్మహత్యపై తాప్సీ పోస్ట్ వైరల్
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన దగ్గరి నుంచి ఎవరు ఎందుకు చనిపోతున్నారో.. ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు
By: Tupaki Desk | 1 May 2025 7:00 PM ISTసోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన దగ్గరి నుంచి ఎవరు ఎందుకు చనిపోతున్నారో.. ఎందుకు ఆత్మ హత్య చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. కొంతమందైతే మరీ సిల్లీ రిజన్‌లకు ఆత్మహత్యలకు పూనుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మిషా అగర్వాల్ సూసైడ్ చేసుకోవడం తెలిసిందే. తను కూడా ఇలాంటి సిల్లీ రీజన్‌కు ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మిషా అగర్వాల్ సోషల్ మీడియాలో తనకు ఫాలోవర్స్ తగ్గారనే కారణంతో ఆత్మ హత్య చేసుకోవడం షాక్‌కు గురి చేస్తోంది.
దీనిపై హీరోయిన్ తాప్సీ తాజాగా స్పందించారు. మిషా అగర్వాల్ ఆత్మహత్యపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని తాను ముందే భయపడ్డానని తెలిపింది. తాప్సీ మాట్లాడుతూ `ప్రస్తుతం సోషల్ మీడియాపై ప్రతి ఒక్కరికీ ఉన్న వ్యామోహం చూసి ఇలాంటి ఒక రోజు వస్తుందని ముందే భయపడ్డాను. జీవితాన్ని మనం ప్రేమించడం కంటే ఫాలోవర్స్ సంఖ్యకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
చుట్టూ ఉన్నవారు చూపించే నిజమైన ప్రేమకంటే ఆన్‌లైన్ ప్రేమకే ఎక్కువ మొగ్గుచూపుతామని భయపడ్డా. ఇప్పుడు అదే జరిగింది. మనం ఎన్నో ఏళ్ల పాటు చదువుకున్న డిగ్రీలను లైక్‌లు, కామెంట్స్ అధిగమిస్తాయని ఊహించా. ఈ రోజు నేను భయపడినట్టే సంఘటనను చూడటం నిజంగా బాధాకరం. నా హృదయం ముక్కలైంది` అని తాప్సీ నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాప్సీ ప్రస్తుతం ఓ లడ్‌కీహై కహా, గాంధారి వంటి బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.
