Begin typing your search above and press return to search.

శ్రీ‌రాముని ఆశీస్సులు కోరిన 'స్వ‌యంభు'

రామ మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ రోజున స్వ‌యంభు శ్రీ‌రాముని ఆశీస్సులు కోరుతున్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు

By:  Tupaki Desk   |   23 Jan 2024 4:18 AM GMT
శ్రీ‌రాముని ఆశీస్సులు కోరిన స్వ‌యంభు
X

నిఖిల్ సిద్ధార్థ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా 'స్వయంభు'. ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు కాగా, ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ ప‌తాకంపై భువన్ - శ్రీకర్ నిర్మిస్తున్నారు. నిఖిల్ లెజెండరీ యోధుడి పాత్రలో నటించేందుకు ఆయుధ పోరాటం, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నాడు. భారీ యుద్ధ స‌న్నివేశాల‌తో అత్యంత భారీగా రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఇప్ప‌టికే పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ నెల‌కొంది. ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ క‌థానాయిక‌.

రామ మందిర ప్రాణ‌ప్ర‌తిష్ఠ రోజున స్వ‌యంభు శ్రీ‌రాముని ఆశీస్సులు కోరుతున్న పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఇందులో టైటిల్ పాత్ర‌ధారి నిఖిల్ సిద్ధార్థ్ శ్రీ‌రాముని దివ్య‌స‌ముఖ‌మున‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తూ త‌మ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాల‌ని ఆశీస్సులు కోరుతున్న దృశ్యం క‌నిపిస్తోంది. ఈ సినిమా నిఖిల్ కెరీర్ కి 20వ సినిమా కావ‌డం ఆసక్తికరం. ''భగవంతుడు శ్రీరాముడు అయోధ్య నుండి మనందరినీ అనుగ్రహించు ఈ మహత్తరమైన రోజున #స్వయంభు బృందం మర్యాద పురుషోత్తముని వేడుక‌ను వైభ‌వంగా జరుపుకుంది.. జై శ్రీ రామ్'' అని చిత్ర‌బృందం భ‌క్తి, విన‌మ్ర‌త‌ను చాటుకుంటూ ఈ వ్యాఖ్య‌ను జోడించింది.

స్వయంభు టాలీవుడ్ లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెర‌కెక్కుతున్న భారీ చిత్రం. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండ‌గా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంత‌కుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లెజెండరీ యోధుడిగా నిఖిల్ అద్భుతంగా కనిపించాడు. కార్తికేయ 2 తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న అత‌డు రెట్టించిన ఉత్సాహంతో యుద్ధ‌ వీరుడిగా న‌టిస్తున్నాడు.