Begin typing your search above and press return to search.

గుండె త‌రుక్కుపోతుదంటూ సోద‌రి ఆవేద‌న‌!

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భౌతికంగా లేకపోయినా? ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి.

By:  Srikanth Kontham   |   8 April 2026 7:45 PM IST
గుండె త‌రుక్కుపోతుదంటూ సోద‌రి ఆవేద‌న‌!
X

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భౌతికంగా లేకపోయినా? ఆయన జ్ఞాపకాలు మాత్రం అభిమానుల గుండెల్లో సజీవంగానే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో సుశాంత్‌ను శ్రీరాముడి గెటప్‌లో చూపిస్తూ రూపొందించిన కొన్ని కృత్రిమ మేధ చిత్రాలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి భావోద్వేగానికి లోనయ్యారు. తన తమ్ముడిని ఆ దైవిక రూపంలో చూసి "గుండె తరుక్కుపోతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదనను పంచుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నితేష్ తివారీ దర్శకత్వంలో `రామాయణంస‌`చిత్రం తెర‌కెక్కుతోన్న‌ సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సుశాంత్ గనుక జీవించి ఉంటే రాముడి పాత్రకు ఆయన కంటే గొప్ప ఎంపిక మరొకటి ఉండేది కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఏఐ సాంకేతికతను ఉపయోగించి సుశాంత్‌ను రాముడిగా చిత్రీకరిస్తూ ఈ ఫోటోలను సృష్టించారు. ఈ చిత్రాల్లోని సుశాంత్ ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత, తేజస్సు చూసి శ్వేతతో పాటు లక్షలాది మంది అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. శ్వేతా సింగ్ కీర్తి స్పందిస్తూ `ఈ ఫోటోలు చూస్తుంటే నా మనసు ముక్కలవుతోంది. సుశాంత్ బ్రతికి ఉంటే నిజంగానే ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయేవాడు.

అతనిలో ఉన్న ఆ దైవత్వం, అంకితభావం రాముడి పాత్రకు పరిపూర్ణతను ఇచ్చేవి` అన్నారు. సుశాంత్ తన కెరీర్‌లో ఎంచుకున్న వైవిధ్యమైన పాత్రలు, ఆయన నటనలోని లోతును గుర్తు చేసుకుంటూ ఇలాంటి ఐకానిక్ పాత్రలో ఆయనను చూడలేకపోతున్నామనే బాధ ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. నిజానికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆధ్యాత్మికతకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య సమతుల్యతను పాటించే వ్యక్తి. ఆయన కళ్లలో ఉండే మెరుపు, స్వచ్ఛమైన చిరునవ్వు శ్రీరాముడి పాత్రకు ఎంతో సరిపోతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తు న్నారు.

రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నప్పటికీ సుశాంత్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడిని ఆ స్థానంలో ఊహించుకుంటూ పాత జ్ఞాపకాలను నెమర వేసుకుంటున్నారు. ఏఐ సృష్టించిన ఈ మాయాజాలం సుశాంత్ లేని లోటును మరోసారి అందరికీ గుర్తుచేసింది. ఒక నటుడు మరణించిన తర్వాత కూడా సాంకేతికత సహాయంతో వారిని ఇష్టమైన పాత్రల్లో చూసుకోవడం అభిమానులకు ఒక రకమైన ఊరటను ఇస్తుంది. కానీ అదే సమయంలో ఆ నటుడు భౌతికంగా లేడనే చేదు నిజం వారిని మరింత కృంగదీస్తుంది. శ్వేతా సింగ్ కీర్తి విషయంలోనూ అదే జరిగింది.

ఆ ఫోటోలు అందంగా ఉన్నప్పటికీ తన తమ్ముడు అద్భుతమైన ప్రయాణంలో భాగం కాలేకపోయాడన్న ఆవేదన ఆమెను వెంటాడుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి నటుడు మాత్రమే కాదు. కోట్ల మందికి ఒక ఎమోషన్. ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఆయన పట్ల ప్రజల్లో ఉన్న ఆరాధన ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. రాముడిగా ఆయన కనిపించిన తీరు , సోదరి పంచుకున్న భావోద్వేగం మరోసారి సుశాంత్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.