అన్న కొడుకు పెళ్లిలో వైయస్ జగన్‌తో హీరోలు సూర్య-కార్తీ!
చెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి- మేకపాటి వేదిక జంట వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 8 Feb 2026 1:32 PM ISTచెన్నైలో జరిగిన వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి- మేకపాటి వేదిక జంట వివాహ వేడుకకు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి , కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఈ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుండటంతో చాలా మందికి చాలా సందేహాలు మొదలయ్యాయి. `ఫ్రెండ్స్ రీయూనియన్` పేరుతో జగన్ ఫ్యాన్ పేజీలు ఈ వీడియోని షేర్ చేయడంతో దీనిపై చాలా చర్చ సాగుతోంది. అసలు హీరోలు సూర్య, కార్తీతో జగన్ రిలేషన్ ఎలాంటిది? ఆ ఇద్దరికీ జగన్ అంత క్లోజా? ఈ పెళ్లికి హీరోలు సూర్య- కార్తీ బ్రదర్స్ అటెండవ్వడానికి కారణం? కేవలం చెన్నైలో పెళ్లికి వెళితే జగన్ కి ఇంతగా జనాల నీరాజనమా? ఎందుకు ఇంతటి ఫాలోయింగ్? అంటూ రకరకాల ప్రశ్నల్ని నెటిజనులు సంధిస్తున్నారు.
వైఎస్ సునీల్ రెడ్డి ఎవరు? జగన్, షర్మిలలతో బంధుత్వం ఏంటి? అన్నది ఆరా తీస్తే...నారెడ్డి సునీల్ రెడ్డి వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, బంధువు. జగన్ పెదనాన్న వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడే ఈ సునీల్ రెడ్డి. అంటే జగన్ - షర్మిలలకు ఈయన వరుసకు అన్న అవుతారు. సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ రెడ్డి వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. వధువు పేరు మేకపాటి వేదిక. ఈమె మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనవరాలు, దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడైన మేకపాటి పృథ్వీనాథ్ రెడ్డి కుమార్తె.
ఈ ఘనమైన సెలబ్రిటీ పెళ్లిలో స్టార్ హీరోలు సూర్య, కార్తీ నేరుగా వైయస్ జగన్ ని సాధరంగా హగ్ చేసుకుని ఆహ్వానించడం ఆశ్చర్యపరిచింది. హీరోలు సూర్య, కార్తీలతో జగన్ రిలేషన్ ఏంటి? అంటే.. జగన్ - సూర్యల మధ్య బంధం ఇప్పటిది కాదు.. ఇది దశాబ్దాల నాటి స్నేహం. జగన్ తన చిన్నతనంలో వ్యాపార రీత్యా చెన్నైలో ఉన్నప్పుడు సూర్య, కార్తీలతో మంచి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారంతా సన్నిహితులుగా ఉన్నారు.
ఒక ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. జగన్ తనకు పాత స్నేహితుడు అని తెలిపారు. మేమిద్దరం కలిసినప్పుడు ఏకంగా 4-5 ఐస్ క్రీములు తింటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటామని కూడా వెల్లడించారు. ఆయన ఒక రియల్ ఫైటర్ అని కూడా సూర్య కొనియాడారు. సూర్య- కార్తీ ఈ పెళ్లికి ఎందుకు వచ్చారు? అంటే.. కేవలం జగన్ కోసమే కాకుండా, సునీల్ రెడ్డి కుటుంబంతో కూడా సూర్య కుటుంబానికి మంచి అనుబంధం ఉండటంతో ఈ వేడుకకు వారు హాజరయ్యారు.
చెన్నైలో జగన్‌కు అంత నీరాజనమా?
వైకాపా అధినేతగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని చోట్లా ఫాలోయింగ్ ఉంది. చెన్నైలో జగన్ కనిపిస్తే జనాలు బ్రహ్మరథం పట్టడానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. దీనికి కడప-చెన్నై కనెక్షన్ కీలకంగా పని చేసింది. రాయలసీమకు చెందిన చాలా మంది రెడ్లు ( తెలుగు వారు) చెన్నైలో స్థిరపడ్డారు. వారందరికీ వైఎస్ కుటుంబం అంటే అపారమైన అభిమానం. పైగా జగన్ పెరిగింది.. చదువుకుంది కొంతకాలం చెన్నైలోనే కావడంతో అక్కడ ఆయనకు పాత స్నేహితులు, పరిచయాలు చాలా ఎక్కువ.
అధికారం ఉన్నా లేకపోయినా జగన్ మాస్ ఫాలోయింగ్ తగ్గలేదని, ముఖ్యంగా పక్క రాష్ట్రంలో కూడా ఆయనను చూడటానికి జనం ఎగబడటం చూస్తుంటే, అతడికి ఉన్న వ్యక్తిగత చరిష్మా అలాంటిది అని అంగీకరించాలి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జగన్, సూర్య - కార్తీలను ఆత్మీయంగా హగ్ చేసుకోవడం, వారితో కాసేపు ముచ్చటించడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
సాహిల్ రెడ్డి వివాహం
వేదిక మేకపాటి కుటుంబానికి చెందిన అమ్మాయి. సాహిల్- వేదిక జంట వివాహం 8 ఫిబ్రవరి 2026 (ఆదివారం) ఉదయం చెన్నైలోని ఇంజంబాక్కం, విజిపీ లేఅవుట్ వద్ద ఉన్న అనిల్ రెడ్డి నివాసంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహం ద్వారా రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. వధువు వేదిక, మాజీ మంత్రి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి చెందిన లేదా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి సన్నిహిత బంధువు అని తెలుస్తోంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి - వైఎస్సార్ కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న రాజకీయ అనుబంధం ఇప్పుడు బంధుత్వంగా మారింది.
జగన్, సూర్య, కార్తీలే కాకుండా ఈ వేడుకలో పలువురు రాజకీయ దిగ్గజాలు కనిపించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ వేడుకలో పాల్గొన్నారు. చెన్నైలో జరిగిన వేడుక కావడంతో డీఎంకే పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి.. వారి కుటుంబ సభ్యులు వధువు తరపున అతిథులకు ఆతిథ్యం ఇచ్చారు.
