Begin typing your search above and press return to search.

సూర్య సౌత్ స్కెచ్.. ఈసారి గట్టిగానే..

హీరో సూర్య కెరీర్ గ్రాఫ్ ని గమనిస్తే.. గత కొంతకాలంగా ఆయన బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేకపోతున్నారు.

By:  M Prashanth   |   8 Dec 2025 6:00 AM IST
సూర్య సౌత్ స్కెచ్.. ఈసారి గట్టిగానే..
X

హీరో సూర్య కెరీర్ గ్రాఫ్ ని గమనిస్తే.. గత కొంతకాలంగా ఆయన బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోలేకపోతున్నారు. కంటెంట్ పరంగా ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా, కమర్షియల్ గా మాత్రం ఎక్కడో లెక్క తప్పుతోంది. కానీ 2026 కోసం ఆయన వేసుకున్న ప్రణాళిక చూస్తుంటే మాత్రం.. పాత సూర్య ఈజ్ బ్యాక్ అనిపించక మానదు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం కేవలం ఆయన లైనప్ మాత్రమే కాదు, ఆ సినిమాల కోసం ఆయన ఎంచుకున్న దర్శకుల నేపథ్యం చాలా ఆసక్తి రేపుతోంది.

సాధారణంగా స్టార్ హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా అంటూ బాలీవుడ్ దర్శకుల వైపు లేదా భారీ యాక్షన్ సినిమాల వైపు చూస్తున్నారు. కానీ సూర్య మాత్రం రూటు మార్చారు. "పాన్ ఇండియా" కంటే ముందు "పాన్ సౌత్ ఇండియా" మీద గట్టి పట్టు సాధించాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకే తన రాబోయే మూడు సినిమాల కోసం ఒక పక్కా వ్యూహాన్ని రచించారు. అదేంటంటే.. మూడు సినిమాలు, మూడు భాషల దర్శకులు.

మొదట తన సొంత గడ్డ తమిళనాడులో పట్టు బిగించడానికి లోకల్ పల్స్ తెలిసిన దర్శకుడిని ఎంచుకున్నారు. 45వ సినిమా కోసం తమిళ దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. మాస్ ఆడియెన్స్ కు దగ్గరయ్యే కథలను డీల్ చేయడంలో బాలాజీకి మంచి పేరుంది. ఈ సినిమాతో తమిళ మాస్ సెంటర్లలో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలనేది సూర్య ఆలోచనగా కనిపిస్తోంది.

ఇక సూర్యకు రెండో అతిపెద్ద మార్కెట్ మన తెలుగు రాష్ట్రాలు. ఇక్కడ ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నేరుగా ఒక తెలుగు దర్శకుడితోనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే 46వ సినిమా. ఈ బాధ్యతను టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరికి అప్పగించారు. మన నేటివిటీకి దగ్గరగా ఉంటూనే, సూర్యను తెలుగు ప్రేక్షకులకు మరింత కనెక్ట్ చేసేలా ఈ ప్రాజెక్ట్ ఉండబోతోంది.

వీటన్నింటికంటే ఆసక్తికరమైన నిర్ణయం మరొకటి ఉంది. సూర్యకు కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈసారి మలయాళ ఇండస్ట్రీ వైపు చూశారు. అక్కడ సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు జిత్తు మాధవన్ తో సూర్య 47వ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మలయాళీలు కోరుకునే వైవిధ్యం, సూర్య నటన కలిస్తే అక్కడ రికార్డులు తిరగరాయడం ఖాయం.

2026లో రాబోయే ఈ మూడు సినిమాలతో దక్షిణాదిలోని ప్రధాన భాషలన్నింటినీ కవర్ చేయాలనేది సూర్య మాస్టర్ ప్లాన్. ఒకేసారి తమిళ, తెలుగు, మలయాళ దర్శకులతో సినిమాలు చేయడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ గట్టిగా రాబట్టవచ్చు. ప్రయోగాలు పక్కన పెట్టి, ఆయా భాషల నేటివిటీని నమ్ముకోవడం సూర్య తీసుకున్న తెలివైన నిర్ణయం. మరి ఈ స్ట్రాటజీ సూర్యను మళ్ళీ బాక్సాఫీస్ కింగ్ గా నిలబెడుతుందో లేదో చూడాలి.