'రాజు మహారాజు' నటి కాస్టింగ్ కౌచ్ అనుభవం
తాజా ఇంటర్వ్యూలో సుర్వీన్ మాట్లాడుతూ, తనకు దక్షిణాదిన, అలాగే ఉత్తరాదిన పరిశ్రమలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి, భయానక ఘటనల గురించి బహిరంగంగా మాట్లాడింది.
By: Tupaki Desk | 31 May 2025 12:10 PM'రాజు మహారాజు' చిత్రంలో నటించింది పంజాబీ బ్యూటీ సుర్వీన్ చావ్లా. ఈ ఉత్తరాది భామ తెలుగు చిత్రంలో శర్వానంద్ సరసన నటించింది. ఆ తర్వాత తమిళం, హిందీలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లోను నటించింది. శాక్రెడ్ గేమ్స్, హేట్ స్టోరి 4 లాంటి చిత్రాల్లో సుర్వీన్ అందాల ఆరబోత, నటనకు మంచి పేరొచ్చింది. ఇటీవలే రాణా నాయుడు సీజన్ 2లోను అద్బుత నటనతో ఆకట్టుకున్న సుర్వీన్, పెళ్లి తర్వాతా డిమాండ్ ఉన్న నటిగా మారింది.
తాజా ఇంటర్వ్యూలో సుర్వీన్ మాట్లాడుతూ, తనకు దక్షిణాదిన, అలాగే ఉత్తరాదిన పరిశ్రమలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి, భయానక ఘటనల గురించి బహిరంగంగా మాట్లాడింది. తమిళంలో జాతీయ అవార్డ్ అందుకున్న ఓ ప్రముఖ దర్శకుడు తనకు కమిట్ మెంట్ ఇవ్వాల్సిందిగా, మధ్యవర్తితో మాట్లాడించాడని సుర్వీన్ ఆరోపించారు. ఆ ప్రముఖ దర్శకుడి పేరును నేను బయటకు చెప్పదలుచుకోలేదని సుర్వీన్ వ్యాఖ్యానించింది.
అలాగే ఓ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు తన ఆఫీస్ లో మీటింగ్ తర్వాత తాను వెళుతుంటే, తన వెంటే వచ్చి ముద్దు పెట్టుకోవడానికి సాహసించాడని, తనకు పెళ్లయిందని తెలిసీ అతడు అలా చేసాడని సుర్వీన్ ఆరోపించింది. ముందుకు వంగి ముద్దు పెట్టుకోబోతున్నాడు. కానీ నేను ఏం చేస్తున్నావ్? అంటూ దూరంగా నెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయాను అని సుర్వీన్ తెలిపింది.
పంజాబీ బ్యూటీ సుర్వీన్ తన అనుభవాలను చాలా ఆలస్యంగా బయటపెట్టింది. తనకు ఇలా జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, మీటూ ఉద్యమంలో భాగం కాకుండా ఆలస్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది తమకు జరిగిన అనుభవాలను కొన్నేళ్ల తర్వాత గుర్తు చేసుకుని ఫిర్యాదు చేస్తున్నారు. దీనివల్ల ఈ కేసుల్లో సరైన ఆధారాల్లేక లైంగిక వేధింపుల మాన్ స్టార్స్ తప్పించుకుంటున్నారని ఇటీవలి కొన్ని కోర్టు తీర్పులు నిరూపించాయి. సుర్వీన్ మళ్లీ అదే తప్పు చేసిందంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు.