సూర్య46 క్రేజ్ మామూలుగా లేదుగా!
కోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 3 Nov 2025 6:00 PM ISTకోలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో కూడా సూర్యకు మంచి ఫాలోయింగ్, క్రేజ్ ఉన్నాయి. సినిమా సినిమాకీ కొత్తగా ప్రయత్నిస్తూ, ఎన్నో ప్రయోగాలు చేసే సూర్యకు గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ అందడం లేదు. కష్టపడుతున్నప్పటికీ సూర్యకు దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. ఎప్పటికప్పుడు కష్టపడటమే తప్పించి సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు సూర్య.
వెంకీ అట్లూరితో సూర్య సినిమా
దీంతో తన తర్వాతి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉన్న సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేతులు కలిపారు. సార్, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్‌ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి చెప్పిన కథ సూర్యకు నచ్చడంతో ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకెళ్లారు. సూర్య ఎప్పట్నుంచో తెలుగులో స్ట్రయిట్ మూవీ చేయాలనుకుంటున్నారు కానీ అది ఇన్నాళ్లకు కుదిరింది.
షూటింగ్ దశలో సినిమా
సూర్య కెరీర్లో 46వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకుండానే సూర్య46కు ఓ బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.
డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్
సూర్య46 డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం సూర్య46 డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ నిర్మాతలకు రూ.85 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించనుందని తెలుస్తోంది. రీసెంట్ టైమ్స్ లో సూర్య ఫామ్ లో లేకపోయినప్పటికీ ఇంత భారీ మొత్తానికి అతని సినిమా డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయంటే విశేషమనే చెప్పాలి. ఏదేమైనా సినిమా రిలీజ్‌కు ముందే ఇంత భారీ మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్మడు పోయాయంటే ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
