Begin typing your search above and press return to search.

ఫ్యామిలీస్‌కు కనెక్టయితే విధ్వంసమే..

మాస్ చిత్రాల మోజులో పడి స్టార్ హీరోల్లో చాలామంది పూర్తిగా పక్కన పెట్టేసిన జానర్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఒక్కడే ఎప్పట్నుంచో నిలకడగా ఈ జానర్లో సినిమాలు చేస్తున్నాడు.

By:  Garuda Media   |   15 Aug 2026 6:01 PM IST
ఫ్యామిలీస్‌కు కనెక్టయితే విధ్వంసమే..
X

మాస్ చిత్రాల మోజులో పడి స్టార్ హీరోల్లో చాలామంది పూర్తిగా పక్కన పెట్టేసిన జానర్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగులో విక్టరీ వెంకటేష్ ఒక్కడే ఎప్పట్నుంచో నిలకడగా ఈ జానర్లో సినిమాలు చేస్తున్నాడు. స్టార్లు ఈ జానర్లో నటిస్తే మంచి రీచ్ ఉంటుందని, కలెక్షన్ల రికార్డులు కూడా బద్దలవుతాయని గతంలో ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురములో’ లాంటి సినిమాలు రుజువు చేశాయి.

అయినా సరే పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాల మోజులో పడి ఈ తరహా చిత్రాలను పక్కన పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు చిత్రాలతో ఈ జానర్‌కు మాంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. దీంతో మిగతా పెద్ద స్టార్లు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్లలోకి దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ దిశగా ఇండస్ట్రీ జనాలు మరింత ఆలోచించేలా చేస్తోంది ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.

ఈ శుక్రవారం రిలీజైన సూర్య సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. అలా అని యునానమస్ రివ్యూలేమీ రాలేదు. ఉదయం కొంచెం నెమ్మదిగా మొదలైన ఈ చిత్రం.. సాయంత్రానికి పుంజుకున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా తమిళనాడులో మార్నింగ్ షోలకు పెద్దగా జనాల్లేక కళ తప్పిన థియేటర్లు సాయంత్రానికి నిండిపోయాయి. సినిమాలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా అనే టాక్ రావడంతో ఆ వర్గం ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈవెనింగ్, నైట్ షోలకు మామూలు రెస్పాన్స్ లేదు. ఒక పెద్ద హీరో నటించిన మాస్ సినిమాకు ఏమాత్రం తగ్గని విధంగా ఆక్యుపెన్సీలు కనిపించాయి. శని, ఆదివారాల్లో కూడా సినిమా వసూళ్ల మోత మోగించేలా కనిపిస్తోంది. సూర్య చివరి చిత్రం ‘కరుప్పు’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ.. క్లాస్ సినిమా కావడంతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు మరీ హైప్ ఏమీ కనిపించలేదు.

ఇది జనం ఎగబడి చూసే సినిమా కాదని, ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంటుందని అంచనా వేశారు. ముఖ్యంగా తమిళనాట అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా కనిపించలేదు. కానీ తొలి రోజు సాయంత్రానికి పరిస్థితులు మారిపోయాయి. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రస్తుత జోరు చూస్తుంటే ‘కరుప్పు’కు ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తే ఆశ్చర్యమేమీ లేదు.