Begin typing your search above and press return to search.

హీరో సూర్య ఊరికి వెళ్లి 'ఒణ‌క్కం' అంటూ ఊపేసిన తెలుగు ద‌ర్శ‌కుడు

'ఒణక్కం' అంటూ తమిళ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తూ వేదికపైకి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించి.. తమిళ గడ్డపై సూర్య క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పారు.

By:  Sivaji Kontham   |   3 Aug 2026 11:11 AM IST
హీరో సూర్య ఊరికి వెళ్లి ఒణ‌క్కం అంటూ ఊపేసిన తెలుగు ద‌ర్శ‌కుడు
X

సౌత్ ఇండియా వర్సటైల్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ఆడియో విడుదల వేడుక కోయంబత్తూర్‌లో అభిమానుల సమక్షంలో కోలాహలంగా జరిగింది. ఈ వేడుకలో తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తమిళంలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'ఒణక్కం' అంటూ తమిళ ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తూ వేదికపైకి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించి.. తమిళ గడ్డపై సూర్య క్రేజ్‌ను మరోసారి చాటిచెప్పారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వెంకీ అట్లూరి, కోయంబత్తూర్‌ను ఈవెంట్ వేదికగా ఎంచుకోవడానికి గల ప్రత్యేక కారణాన్ని వెల్లడించారు. ఈ సినిమా ప్రయాణాన్ని మొదట పళని మలైలోని మురుగన్ భగవానుడి ఆశీస్సులతో ప్రారంభించామని.. అందుకే మొదటి భారీ ఆడియో వేడుకను కూడా సూర్య సొంత ఊరైన కోయంబత్తూర్‌లో.. ఆయన అభిమానుల మధ్య నిర్వహించాలనుకున్నామని తెలిపారు. 2023లోనే సూర్య గారితో సినిమా చేయాలని తాను మనస్ఫూర్తిగా కోరుకున్నానని.. ఈ రోజు ఆ కోరిక నెరవేరడంపై ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

సినిమా విశేషాలు షేర్ చేస్తూ... మునుపెన్నడూ చూడని రీతిలో సూర్య క్యారెక్టరైజేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా యవ్వనంలో ఉండే అబ్బాయిలు తమ తల్లిదండ్రుల వద్ద కొన్ని నిజాలు దాచే క్రమంలో జరిగే సన్నివేశాలను ఎంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇందులో సూర్య .. నటి రాధిక శరత్‌కుమార్‌ల మధ్య వచ్చే దాదాపు 10 నిమిషాల కామెడీ సన్నివేశం ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్విస్తుందని.. సూర్య కెరీర్‌లోనే ఇదొక కొత్త తరహా హ్యూమన్ లవ్ స్టోరీగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే చిత్రబృందాన్ని, నటీనటులను వెంకీ అట్లూరి కొనియాడారు. హీరోయిన్ మమితా బైజు సెట్‌లో ఒక కుటుంబ సభ్యురాలిలా కలిసిపోయిందని ప్రశంసించారు. ఇక సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్‌తో తనకు ఇది మూడో సినిమా అని.. ప్రతిసారీ తన అంచనాలకు మించి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారని అన్నారు. కెమెరామెన్ నిమిష్, ఎడిటర్ నవీన్ నూలిలతో పాటు ఇతర సాంకేతిక నిపుణులందరూ సినిమా అద్భుతంగా రావడం కోసం పడిన కష్టాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుని ధన్యవాదాలు తెలియజేశారు.

చివరగా విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ చిత్రం కేవలం అభిమానులకే కాకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని హామీ ఇచ్చారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే చూసి ఆస్వాధించాలని... సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో నిండిపోతుందని సవినయంగా తెలుగు కుర్రాడు వెంకీ అట్లూరి తంబీల‌ద‌రికీ విజ్ఞప్తి చేశారు.