సూర్యకు జోడీగా షెకావత్ భార్య?
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు హీరో సూర్య.
By: Sravani Lakshmi Srungarapu | 2 Oct 2025 2:00 PM ISTకోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు హీరో సూర్య. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, ప్రతీ సినిమాతో కొత్తదనం చూపించాలని తాపత్రయపడుతూంటారు. ఓ వైపు యాక్షన్ డ్రామాలు చేస్తూనే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన జై భీమ్, సూరరై పొట్రు లాంటి సినిమాలు నేషనల్ లెవెల్ లో ప్రశంసలు అందుకోవడంతో పాటూ అవార్డులు కూడా గెలుచుకున్నారు.
గత కొన్ని సినిమాలుగా సక్సెస్ లో లేని సూర్య
అయితే కొంత కాలంగా సూర్య ఎంత కష్టపడుతున్నా ఆ కష్టమంతా బూడిదలో పోసినట్టు వృధానే అవుతుంది తప్పించి ఉపయోగపడటం లేదు. కొన్ని సినిమాలుగా సూర్యకు సక్సెస్ అనేదే దక్కడం లేదు. కంగువ, రెట్రో సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న సూర్య ప్రస్తుతం కరుప్పు అనే సినిమాతో పాటూ తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
జీతూ మోహన్‌దాస్ తో సూర్య సినిమా
ఈ రెండింటిలో కరుప్పు సినిమా మొదటిగా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పుడు సూర్య మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళంలో వరుస హిట్లు అందుకున్న జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య తన 47వ సినిమాను చేయనున్నారు. రోమాంచమ్, ఆవేశం లాంటి సినిమాలతో జీతూ మాధవన్ సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
అలాంటి సూపర్‌హిట్ డైరెక్టర్ తో సూర్య సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ మంచి అంచనాలున్నాయి. అయితే జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య చేయనున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్యకు జోడీగా పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా నటించిన ఫహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ జోడీగా నటించనుందని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జీతూ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ తో సూర్య సినిమా చేస్తుండటంతో ఆ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
