Begin typing your search above and press return to search.

సూర్య.. తెలుగులో మళ్లీ ఆ రేంజ్ మార్కెట్ వచ్చినట్లేనా..?

తెలుగు వెర్షన్ దేశవ్యాప్తంగా చూస్తే రూ.25 కోట్లకు పైగానే ఉంది. ఇక సూర్య తెలుగు మార్కెట్ గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ నంబర్లు మాత్రం చిన్నవి కావు.

By:  M Prashanth   |   17 Aug 2026 10:35 AM IST
సూర్య.. తెలుగులో మళ్లీ ఆ రేంజ్ మార్కెట్ వచ్చినట్లేనా..?
X

విశ్వనాథ్ అండ్ సన్స్ మొదటి మూడు రోజుల్లోనే మంచి నంబర్ దగ్గరకు వచ్చేసింది. ట్రాకింగ్ లెక్కల ప్రకారం ఆదివారం ముగిసేసరికి ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు రూ.23-24 కోట్ల గ్రాస్ వచ్చినట్లు అంచనా. తెలుగు వెర్షన్ దేశవ్యాప్తంగా చూస్తే రూ.25 కోట్లకు పైగానే ఉంది. ఇక సూర్య తెలుగు మార్కెట్ గత కొన్నేళ్లతో పోలిస్తే ఈ నంబర్లు మాత్రం చిన్నవి కావు.

సూర్యకు ఒకప్పుడు తెలుగులో తమిళ హీరో అనే ఫీలింగ్ కూడా ఉండేది కాదు. గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం సినిమాలతో ఇక్కడ మంచి బేస్ ఏర్పడింది. 2016లో వచ్చిన 24 ఆ మార్కెట్‌కు ఒక పీక్. అప్పటి ట్రేడ్ లెక్కల ప్రకారం ఏపీ, నైజాంలో దాదాపు రూ.15.5 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ లెక్కల్లో చూస్తే రూ.25 కోట్లకు పైగానే వెళ్లినట్లు అప్పటి అంచనాలు ఉన్నాయి.

కానీ ఆ తర్వాత అదే స్థాయి రెగ్యులర్‌గా కొనసాగలేదు. సింగం 3, గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్త్, ఈటీ వరుసలో కొన్ని సినిమాలకు ఓపెనింగ్స్ వచ్చినా పెద్ద రన్ దొరకలేదు. గ్యాంగ్ కూడా పది రోజులకు ఏపీ, తెలంగాణలో రూ.6.87 కోట్ల దగ్గరే ఉన్నట్లు అప్పటి లెక్కలు చెబుతున్నాయి. కంగువ మీద భారీ అంచనాలు ఉన్నా ఫలితం కలిసి రాలేదు. రెట్రో కూడా తెలుగులో పెద్దగా పుంజుకోలేదు. ఆ గ్యాప్‌ను ఈ ఏడాది వీరభద్రుడు మార్చింది. తమిళంలో కరుప్పుగా వచ్చిన ఈ సినిమా తెలుగులో కూడా బాగా నిలబడింది. ఆ లెక్క 25 కోట్ల మార్క్ నీ టచ్ చేసినట్లు అంచనా. 24 తర్వాత సూర్యకు తెలుగులో వచ్చిన మొదటి పెద్ద థియేట్రికల్ హిట్ ఇదే అని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో మరింత బూస్ట్ దొరికినట్లు తెలుస్తోంది. వీరభద్రుడు ఫుల్ రన్‌లో చేరిన రేంజ్‌కు ఈ సినిమా మూడు రోజుల్లోనే చాలా దగ్గరగా వచ్చింది. పైగా శనివారం, ఆదివారం ఏపీ-తెలంగాణలో రోజుకు రూ.8 కోట్లకు పైగా గ్రాస్ ట్రాక్ అయింది. సోమవారం నుంచి అదే వేగం ఉండకపోవచ్చు. కానీ పాత రికార్డు దాటడానికి ఇప్పుడు చాలా పెద్ద దూరం మాత్రం మిగల్లేదు.

తక్కువ టైమ్ లోనే సూర్యకు తెలుగులో రెండోసారి ఇలాంటి నంబర్లు రావడం ఇక్కడ అసలు పాయింట్. అయితే ఒక్క సినిమా హిట్ అయితే దాన్ని కంటెంట్ ఖాతాలో వేసేయొచ్చు. కానీ వీరభద్రుడు తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ కూడా రూ.30 కోట్ల రేంజ్‌కు వెళ్ళింది. దీంతో సూర్య తెలుగు థియేట్రికల్ మార్కెట్ మళ్లీ పాత ట్రాక్ లోకి వచ్చినట్లు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ సినిమాలతో ఇదే పట్టును నిలుపుకుంటాడో లేదో చూడాలి.