టాలీవుడ్ కి 100 పర్సంట్ సూర్య కనెక్ట్ అవుతున్నారా?
డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతికొద్ది మంది తమిళ హీరోల్లో సూర్య ముందు వరుసలో ఉంటారు.
By: Srikanth Kontham | 13 Aug 2026 11:46 AM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అతికొద్ది మంది తమిళ హీరోల్లో సూర్య ముందు వరుసలో ఉంటారు. అయితే ఎంతలా అభిమానించినా సూర్యకు తెలుగు భాష రాకపోవడం వల్ల టాలీవుడ్‌కి ఆయన వంద శాతం కనెక్ట్ కాలేకపోతున్నారనే చర్చ ఎప్పటి నుంచో సినీ వర్గాల్లో నలుగుతోంది. ఒక నటుడిగా సూర్య అసాధారణ ప్రతిభావంతుడు. ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ నటనతో తెలుగు ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించగల సత్తా ఆయన సొంతం.
'గజిని', 'యముడు', '24' వంటి చిత్రాలు తెలుగులో సంచలన విజయాలు సాధించడమే దీనికి నిదర్శనం. ప్రతి సినిమాకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడానికి సూర్య చాలా కష్టపడతారనే విషయం తెలిసిందే. అయినప్పటికీ డైరెక్ట్‌గా తెలుగు మాట్లాడలేకపోవడం, ప్రెస్ మీట్లలో లేదా ఆడియో లాంచ్ వేడుకల్లో తెలుగులో అనర్గళంగా మాట్లాడలేకపోవడం ఒక రకమైన అడ్డంకిగా మారుతోందనే అభిప్రాయం ఉంది. కేరళలో మోహన్‌లాల్, మమ్ముట్టి ఇతర భాషల్లోని స్టార్ హీరోలు అక్కడి స్థానికతకు ఎంతగా కనెక్ట్ అవుతారో? టాలీవుడ్ ప్రేక్షకులతో ఆ స్థాయిలో పూర్తిగా మమేకం కావడానికి భాష రాకపోవడం కొంతమేర అడ్డుపడుతోంది.
ఇటీకాల కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ అనే సరిహద్దులు చెరిగిపోయి పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవడానికి భాషను ఒక వారధిగా వాడుకున్నారు. సూర్య కూడా తన సినిమాలను తెలుగులో డైరెక్ట్‌గా ప్రమోట్ చేయడానికి ఎంతో శ్రమిస్తున్నప్పటికీ సంభాషణల్లో ఉండే ఆత్మను పూర్తిగా వ్యక్తపరచడంలో భాషా పరిమితులు కొద్దిగా ఇబ్బందికరంగా మారుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులు కేవలం నటనను మాత్రమే కాకుండా మాతృభాషలో తమతో మాట్లాడే హీరోలను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. సూర్య సినిమాలపై ఎంత ప్రేమ చూపించినా? ఆయనతో ఉన్న ఆత్మీయత కొద్దిపాటి భాషా అడ్డంకి కారణంగా ఒక స్థాయి వద్దే ఆగిపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం సూర్య `విశ్వనాధ్ అండ్ సన్స్` అనే తొలి తెలుగు సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమయానికైనా తెలుగు నేర్చుకుంటారనుకున్నారంతా. కానీ సూర్య భాషపై పెద్దగా ఆసక్తి చూపించలేదని ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో అర్దమవుతుంది.
ఆయన మళ్లీ డబ్బింగ్ ఆర్టిస్టులపైనే ఆధారపడుతున్నట్లు కనిపిస్తుంది. మరి భవిష్యత్తులో మరిన్ని తెలుగు నేటివిటీ ఉన్న పాత్రలు చేసినా లేదా తెలుగులో డైరెక్ట్‌గా మాట్లాడగలిగితే ఈ దూరం పూర్తిగా తొలగిపోతుంది. నటుడిగా సూర్యకు తెలుగు గడ్డపై ఉన్న ఇమేజ్ ఎప్పటికీ చెరగనిది. భాష రాకపోవడం చిన్న మైనస్ అయినా? ఆయన సిన్సియారిటీ, హార్డ్‌వర్క్ ఆ లోటును ఎప్పుడూ భర్తీ చేస్తూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో సూర్య సినిమాలతో ఈ కనెక్షన్‌ను మరింత బలపరుచుకుంటారని అభిమానుల ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
