42 లక్షలు మోసపోయిన హీరో సూర్య భద్రతాధికారి.. ఏమైందంటే?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
By: Madhu Reddy | 24 Sept 2025 10:47 AM ISTఈ మధ్యకాలంలో ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి మోసాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు ఆశ చూపిస్తూ అందులో పెట్టుబడి పెడితే.. రెట్టింపు అవుతుందని నమ్మబలికి.. ఆ తర్వాత డబ్బులు తీసుకొని పరారీ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి కేస్ ఇప్పుడు మరొకసారి తెరపైకి వచ్చింది. ఏకంగా 42 లక్షలు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ మోసపోయారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సూర్య దగ్గర భద్రతాధికారిగా పనిచేస్తున్నారు ఆంటోనీ జార్జ్ ప్రభు. గత కొంతకాలంగా సూర్య దగ్గరే సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేస్తున్న ఈయన.. ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తులను నమ్మి మోసపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్య ఇంట్లో సులోచన , ఆమె కుమారుడు పనిచేస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ జార్జ్ కు వీరు అధిక వడ్డీ ఆశ చూపించగా.. మొదట ఆయన వీరిని నమ్మి లక్ష రూపాయలు ఇచ్చారు. దానికి బదులుగా సులోచన, తన కొడుకు 3 తులాల బంగారాన్ని జార్జ్ కు ఇచ్చారు. దీంతో జార్జ్ కి నమ్మకం కలిగి ఫిబ్రవరి నెలలో మొత్తం 42 లక్షల రూపాయలను నిందితులకు బదిలీ చేశారు.
ఇక వడ్డీ వస్తుందని నమ్మిన జార్జ్ కి అప్పటినుంచి వాళ్లు డబ్బులు ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు. దీంతో తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయగా.. సులోచన కుటుంబం సూర్యా ఇంటి నుండి పారిపోయింది. విషయం తెలుసుకున్న జార్జ్ వెంటనే పోలీసుల కు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా ఇందులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇదే కుటుంబం చెన్నైలో పలువురిని నమ్మించి సుమారుగా రెండు కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇకపోతే ఈ తల్లి కొడుకుల తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే ఇక్కడ ఆ నలుగురు కూడా సూర్య ఇంట్లోనే పని చేసేవారు కావడం గమనార్హం. మొత్తానికి అయితే అధిక వడ్డీ ఆశతో సూర్య భద్రతాధికారి ఆంటోనీ జార్జ్ ప్రభు భారీగా మోసపోయారని చెప్పవచ్చు.
సూర్య విషయానికి వస్తే.. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా కథా ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈయన.. ఇటీవల రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మమిత బైజు హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈసినిమా.
