Begin typing your search above and press return to search.

వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లతో 'సీన్' క్రియేట్ చేస్తున్న హీరో

ఈ సినిమాలో సూర్యతో పాటు నజ్రియా ఫహాద్, నస్లేన్, లాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   30 Oct 2026 9:29 AM IST
వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లతో సీన్ క్రియేట్ చేస్తున్న హీరో
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే.. మరోవైపు కమర్షియల్ హ్యాట్రిక్ హిట్లపై కన్నేశారు. కెరీర్‌ను మరింత ఉత్సాహంగా సాగిస్తున్న ఈ సీనియ‌ర్ హీరో ఇప్పుడు తన తదుపరి చిత్రం `సీన్`తో దీపావళి బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు. జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ ఈ మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో సూర్యతో పాటు నజ్రియా ఫహాద్, నస్లేన్, లాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆవేశం, రోమాంచం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి తోడు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ అందిస్తున్న సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచనున్నాయి. విభిన్న శైలి చిత్రాల మేళవింపుగా వస్తున్న `సీన్` సినిమా ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ప్రకటన సోషల్ మీడియాలో వచ్చినప్పటి నుండి అభిమానుల నుండి గొప్ప‌ స్పందన లభిస్తోంది. కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది లైకులు, వేల సంఖ్యలో కామెంట్లు రావడంతో పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా పోస్టర్లో సూర్య సరికొత్త లుక్, అత‌డి కళ్లలోని ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులను కట్టిపడేశాయి. `ది వన్ ఈజ్ కమింగ్ టూ రూల్ దిస్ దీపావళి` అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండటంతో.. ఈ దీపాల పండ‌క్కి థియేటర్లలో బాక్సాఫీస్ మోత మోగడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేవలం `సీన్` మాత్రమే కాకుండా,, హీరో సూర్య చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిష్టాత్మక దర్శక‌నిర్మాత‌ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 48వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సమాజంలో బలమైన చర్చకు తావిచ్చే ఒక విభిన్నమైన సామాజిక ఇతివృత్తంతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. జ్ఞానవేల్ మునుపటి చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ బలమైన భావోద్వేగాలు, సందేశం ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక ఆ తర్వాత `మండాడి` ఫేమ్ మతిమారన్ దర్శకత్వంలోనూ సూర్య నటించనున్నట్లు సమాచారం అందింది. మతిమారన్ శైలికి తగినట్లుగా పక్కా యాక్షన్- ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే కెరీర్‌ మైలురాయి 50వ చిత్రంగా బ్లాక్‌బస్టర్ `కరుప్పు`కి సీక్వెల్‌గా `కరుప్పు-2` సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా వరుస వైవిధ్యమైన కథలతో సూర్య తన లైనప్‌ను మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న సూర్య మునుముందు వ‌రుస సినిమాల‌తో ఎలాంటి సీన్ క్రియేట్ చేస్తాడో చూడాల‌ని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా అత‌డి వైవిధ్య‌మైన ఎంపిక‌లు స్పెష‌ల్ ట్రీట్ గా నిల‌వ‌నున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.