'పాన్ ఇండియా' ఎవరు మొదలు పెట్టారు? 'కింగ్ నాగార్జున'పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
నాగార్జున పాన్-ఇండియా విజన్ గురించి సూర్య ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
By: Sivaji Kontham | 3 Nov 2026 9:57 AM ISTనేటి సినీ పరిశ్రమలో `పాన్-ఇండియా` అనే పదం ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రతీ ఒక్కరూ బహు భాషలలో సినిమాలు చేస్తూ సరిహద్దులు చెరిపేస్తున్న వేళ.. ఈ ట్రెండ్‌ను దశాబ్దాల క్రితమే ప్రారంభించిన మార్గదర్శి గురించి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. అసలు పాన్ ఇండియా సినిమాని సౌత్ లో ప్రారంభించింది ఎవరో సూర్య క్లారిటీ గా చెప్పారు.
టాలీవుడ్ సీనియర్ హీరో `నాగ్ సర్` దీనికి ఆద్యుడు అని సూర్య వ్యాఖ్యానించారు. తన కొత్త చిత్రం `సీన్` ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న సూర్య నేరుగా నాగార్జునపై ప్రశంసల జల్లు కురిపించారు. నాగ్ సర్ ఇతర భాషల దర్శకులతో పని చేయడమే కాకుండా..స్వయంగా పొరుగు పరిశ్రమలలో నటిస్తూ పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారని కీర్తించారు.
నాగార్జున పాన్-ఇండియా విజన్ గురించి సూర్య ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆసక్తికర అంశాలను వెల్లడించారు. నేడు ట్రెండ్‌గా మారిన పాన్-ఇండియా కాన్సెప్ట్‌ను నాగ్ సర్ ఎప్పుడో ముందే ఆచరణలో పెట్టారని అన్నారు. మణిరత్నం, ఫాజిల్, ప్రియదర్శన్ వంటి ఇతర భాషల దిగ్గజ దర్శకులతో కలిసి పనిచేస్తూ పొరుగు సినీ పరిశ్రమలను అనుసంధానించడంలో నాగార్జున ఎప్పుడూ ముందున్నారని చెప్పారు. మంచి సినిమాను, వైవిధ్యమైన కంటెంట్‌ను ఎల్లప్పుడూ ఆదరించే నాగ్ తత్వమే తనకు ప్రధాన స్ఫూర్తి అని సూర్య కొనియాడారు.
అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకలో సూర్య భావోద్వేగంతో మాట్లాడుతూ.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అభిమానులు చూపిస్తున్న అన్లిమిటెడ్ ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని.. ``మనమంతా ఒకే కుటుంబం` అని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం తమ పనులన్నీ పక్కన పెట్టి.. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులకు, భద్రతా సిబ్బందికి .. మీడియా ప్రతినిధులకు సూర్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న `రోలెక్స్` సినిమా గురించి సూర్య ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ``స్క్రీన్ పై హీరోనా, విలనా? ఎవరు బెటర్ అంటే.. విలన్ పాత్రే చాలా బెటర్! ఇప్పటివరకు చాలా మంది హీరోలు వచ్చారు... ఇప్పుడు ఒక పవర్ఫుల్ విలన్ రావాల్సిన అవసరం ఉంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను నన్ను కలవమని చెప్పండి.. త్వరలోనే రోలెక్స్ ప్రాజెక్ట్‌ను మనం సాధ్యం చేద్దాం`` అంటూ సూర్య చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో విపరీతమైన జోష్ నింపాయి.
అలాగే తాను నటించిన `సీన్` చిత్రంలోని ఒక శక్తివంతమైన మెసేజ్ ని తన డైలాగుల్లో చెప్పారు.``ఐ యామ్ ది బెస్ట్.. ఐ కెన్ డు ఎనీథింగ్`` (నేనే బెస్ట్.. నేను ఏదైనా చేయగలను) అనే డైలాగ్ ఇతరులతో పోటీపడేందుకు కాదని.. మనపై మనకు నమ్మకం పెంచుకోవడానికేనని చెప్పారు. తాను కూడా ఒకప్పుడు ఎంతో సాధారణమైన ఇంట్రోవర్ట్ వ్యక్తిగా ఉండేవాడినని..తనకే ఇది సాధ్యమైనప్పుడు ప్రతి ఒక్కరూ సాధించగలరని భరోసా ఇచ్చారు. నాగార్జునపై సూర్య చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
