సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్
తమిళ స్టార్ హీరో సూర్య 2026లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సాధించి అరుదైన రికార్డు సృష్టించాడు. 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్', 'సీన్' సినిమాలు కలిపి ఇప్పటివరకు సుమారు రూ.650 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. 'సీన్' మరో వారం థియేటర్లలో నిలిస్తే మొత్తం కలెక్షన్లు రూ.750 కోట్లకు చేరే అవకాశం ఉందని బాక్సాఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
By: Ramesh Palla | 10 Nov 2026 10:06 AM ISTఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి రావడమే గగనం అయింది. అలాంటిది తమిళ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూడు సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అరుదైన రికార్డ్‌ను సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు సూర్య బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను విడుదల చేయడం ద్వారా వాటి విజయంతో హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు సినిమాలు దేనికి అదే అన్నట్టుగా వైవిధ్యభరితంగా ఉండటంతో పాటు, ప్రతి సినిమా మొదటి వారం రోజుల్లోనే వంద కోట్లకు మించి వసూళ్లు రాబట్టడం కూడా ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ప్రస్తుత యంగ్ స్టార్ హీరోల్లో ఏ ఒక్కరికి ఈ అరుదైన రికార్డ్ లేదని చెప్పాలి. ఒకప్పుడు ఒకే క్యాలెండర్ ఇయర్ లో మూడు కాదు పది సినిమాలు చేసిన హీరోలు ఉన్నారు, చాలా మంది హీరోలు ఒకే ఏడాదిలో అర డజను సినిమాలతో హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
తమిళ్ హీరో సూర్య వరుస సినిమాలు...
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏడాదికి ఒక సినిమాను విడుదల చేయడం కష్టంగా మారింది. ఆ సినిమా కూడా హిట్ అయ్యేనా అంటే డౌటే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కొందరు హీరోలు హిట్స్ లేక ఏళ్లకు ఏళ్లుగా కెరీర్‌ను నెట్టుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూర్య ఒక క్యాలెండర్ ఇయర్ లో ఏకంగా మూడు సినిమాలను విడుదల చేయడం జరిగింది. ఒక స్టార్ హీరో ఒక ఇయర్ లో మూడు సినిమాలు విడుదల చేయడం అనేది రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడం కూడా రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. వరుసగా మూడు సినిమాలతో విజయాన్ని సొంతం చేసుకున్న హీరోలు ఇప్పుడు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఇక మరో రికార్డ్ విషయానికి వస్తే ఈ మూడు సినిమాలు సైతం మొదటి వారం రోజుల్లో వంద కోట్లు, అంతకు మించి ఓపెనింగ్స్ ను రాబట్టడం ద్వారా అరుదైన రికార్డ్‌ను నమోదు చేసుకోవడం జరిగింది.
2026లో హ్యాట్రిక్ కొట్టిన సూర్య...
మొత్తానికి సూర్య కెరీర్ లో 2026 సంవత్సరం కచ్చితంగా గోల్డెన్ ఇయర్‌గా, ఈ కాలాన్ని గోల్డెన్ పీరియడ్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని నెలల వ్యవధిలో మూడు విజయాలు సొంతం చేసుకున్న సూర్య ఈ మూడు సినిమాలతో కలిపి ఇప్పటి వరకు రూ.650 కోట్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సూర్య సీన్ ఇంకా థియేటర్లలో ఉంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న సీన్ మరో వారం రోజులు స్ట్రాంగ్ గా బాక్సాఫీస్ వద్ద ఉంటే సూర్య ఈ ఏడాదిలో మూడు సినిమాలతో కలిపి దాదాపు రూ.750 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు అవుతుంది. కొందరు హీరోలు ఒక్క సినిమాతో ఈ నెంబర్ ను సాధించారు అనే వారు ఉంటారు. కానీ ఆ ఒక సినిమా కోసం సదరు హీరో రెండు మూడు ఏళ్లు, అంతకు మించి సమయం తీసుకుని ఉంటాడు. కానీ సూర్య ఒకే ఏడాదిలో మూడు సినిమాలు, ఆ మూడు సినిమాలతో రూ.750 కోట్ల.. ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గుర్తుండి పోయే విషయం అనడంలో సందేహం లేదు.
కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్... సీన్ సినిమాల కలెక్షన్స్...
సూర్య ఈ ఏడాది ఆరంభంలో కరుప్పు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన కరుప్పు సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.300+ కోట్లకు మించి వసూళ్లు రాబట్టినట్లు సమాచారం అందుతోంది. ఇక తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200+ కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఇక తాజాగా విడుదలైన సీన్ ఇప్పటి వరకు రూ.150 కోట్లకు మించి రాబట్టింది. గత ఏడాది నిరాశ పరిచిన సూర్య ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఇలాగే వచ్చే ఏడాదిలోనూ సూర్య కనీసం రెండు సినిమాలతో వచ్చి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇదే సమయంలో ఇతర హీరోల అభిమానులు సైతం సూర్య మాదిరిగా తమ హీరో సైతం ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే బాగుండు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
