Begin typing your search above and press return to search.

ప్రేమ పెళ్లితో ముగిసిపోయేది కాదు.. స్త్రీల గౌరవం, ప్రేమపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!

సౌత్ ఇండియా వర్సటైల్ స్టార్ హీరో సూర్యకు తెలుగు ఆడియెన్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అత‌డు ఇప్పుడు ఒక తెలుగు దర్శ‌కుడు తెర‌కెక్కించిన ద్విభాషా చిత్రంలో న‌టించాడు.

By:  Sivaji Kontham   |   3 Aug 2026 11:11 AM IST
ప్రేమ పెళ్లితో ముగిసిపోయేది కాదు.. స్త్రీల గౌరవం, ప్రేమపై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు!
X

సౌత్ ఇండియా వర్సటైల్ స్టార్ హీరో సూర్యకు తెలుగు ఆడియెన్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అత‌డు ఇప్పుడు ఒక తెలుగు దర్శ‌కుడు తెర‌కెక్కించిన ద్విభాషా చిత్రంలో న‌టించాడు. త‌న ద‌ర్శ‌కుడిని ఆకాశానికెత్తేస్తున్నాడు. దానికి కార‌ణం స్త్రీల‌ను గౌర‌విస్తూ అత‌డు తీసిన సినిమా. సూర్య క‌థానాయ‌కుడిగా వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన `విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్` ఆడియో విడుదల వేడుక ఇటీవల ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో సూర్య మాట్లాడిన మాటలు, ముఖ్యంగా ప్రేమ, వివాహ బంధం.. సమాజంలో మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై అత‌డు వెల్లడించిన అభిప్రాయాలు నెటిజన్లను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

సూర్య మాట్లాడుతూ ప్రేమ అనేది కేవలం వివాహానికి ముందు మాత్రమే ఉండేది కాదని.. పెళ్లితో ముగిసిపోయేది కాదని స్పష్టం చేశారు. వివాహమై 20 సంవత్సరాలు గడిచినా ఒకరిపై ఒకరు అదే ప్రేమాభిమానాలను, పరస్పర గౌరవాన్ని నిరంతరం చూపిస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. మనుషులు వారి ఆలోచనలు కాలంతో పాటు మారినా.. దంపతుల మధ్య ఉండే ఆప్యాయత, అనురాగాలు శాశ్వతంగా నిలిచిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

ముఖ్యంగా సమాజంలో కుటుంబంలో మహిళలు చేసే త్యాగాలను సూర్య ప్రత్యేకంగా కొనియాడారు. ఒక పురుషుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయం కంటే ఒక మహిళ తన గమ్యాన్ని చేరుకోవడానికి పదింతలు కష్టపడాల్సి వస్తుందని అన్నారు. ఇల్లు, పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం మహిళలు ఎంతో కాంప్రమైజ్ అవుతారని.. అందుకే కేవలం ప్రేమించడమే కాకుండా వారి విజయాలకు వంద రెట్లు ఎక్కువ గౌరవం ఇవ్వాలని వేదికపై నుండి పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఈవెంట్ ముగిసిన తర్వాత అక్కడకు వచ్చిన మహిళలందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని అభిమానులకు సూచించి తన బాధ్యతాయుత ప్రవర్తనను చాటుకున్నారు.

ఈ వేడుకలో తన వ్యక్తిగత, వృత్తిగత ప్రయాణంలో భాగమైన పలువురిని సూర్య గుర్తుచేసుకున్నారు. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. తన తమ్ముడు కార్తి విదేశీ విద్య కోసం గతంలో ఆమె చేసిన ఆర్థిక సహాయాన్ని ఎప్పటికీ మరచిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు. అలాగే సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్‌తో తనకున్న సుదీర్ఘ ప్రయాణాన్ని `సూరరై పోట్రు` (ఆకాశం నీ హద్దురా) చిత్రానికి వచ్చిన జాతీయ అవార్డు సాధించిన క్షణాలను గుర్తుచేసుకొని.. ఆయనను ఒక తమ్ముడిలా కొనియాడారు. నటి మమితా బైజు నటనను, దర్శకుడు వెంకీ కథా కథనాలను.. చిత్ర సాంకేతిక బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

చివరగా గత 28 సంవత్సరాలుగా తనను నిరంతరం ఆదరిస్తున్న అభిమానులే తన నిజమైన స్నేహితులని సూర్య ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు తన పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా 5000 మందికి పైగా రక్తదానం చేయడం.. వేలాది మందికి లబ్ధి చేకూర్చడంపై కృతజ్ఞతలు తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ స్క్రీన్ టైమ్ తగ్గించి.. కుటుంబ సభ్యులు, బంధువులతో ఎక్కువ సమయం గడుపుతూ నిజమైన జీవిత జ్ఞాపకాలను ఏర్పరచుకోవాలని ఆయన హితవు పలికారు.