రాజకీయాల్లోకి సూర్య..కాకపుట్టించిన అభిమాని ప్రసంగం!
ఈ మాటలు సూర్య రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారనే సంకేతంగా నెటిజన్లు భావించడంతో గందరగోళం ఏర్పడింది.
By: Srikanth Kontham | 30 Jun 2026 1:37 PM ISTతమిళ రాజకీయాల్లో సినీ నటుల అరంగేట్రం పాత విషయమే అయినా? దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం... పోటీ చేసిన తొలిసారే ముఖ్యమంత్రి అవ్వడం అన్నది అతి పెద్ద చరిత్రే. ప్రస్తుతం ముఖ్యంత్రిగా అతడి పనితీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అభ్యుదయ భావజాలతో గొప్ప పరిపాలన అందిస్తున్నారనేది మేథా వర్గం అభిప్రాయం. ఐదేళ్ల పాలన ఇదే రకంగా కొనసాగితే? విజయ్ స్పీడ్ ను ఇప్పట్లో ఎవరూ ఆపలేరు అన్నది అంతే వాస్తవంగా తెరపైకి వస్తోంది. ఇండస్ట్రీ నుంచి విజయ్ కు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది.
విజయ్ తరం హీరోలంతా అతడికి ఎంతగానో మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇటీవల ఓ అభిమాని చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఆజ్యం పోసాయి. దీనిపై సూర్య అభిమాన సంఘం అప్రమత్తమై అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి సూర్య ప్రవేశంపై ఊహాగానాలు మొదలవ్వడానికి ప్రధాన కారణం ఆర్. వీరమణి అనే అభిమాని చేసిన ప్రసంగం. ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, `కాలం నిర్ణయిస్తే, దేవుడు నిర్ణయిస్తే, ఒక వ్యక్తిని ప్రజా నాయకుడిగా మారకుండా ఎవరూ ఆపలేరు` అని సూర్య గురించి వ్యాఖ్యానించారు.
ఈ మాటలు సూర్య రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారనే సంకేతంగా నెటిజన్లు భావించడంతో గందరగోళం ఏర్పడింది. ఈ ప్రచారంపై స్పందించిన ఆల్ ఇండియా సూర్య ఫ్యాన్స్ క్లబ్ వీరమణి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని స్పష్టం చేసింది. వీరమణి వ్యాఖ్యలను చేసిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోన్న తీరును క్లబ్ తప్పుబట్టింది. వీరమణి గత మూడేళ్లుగా తమ క్లబ్ పరిపాలనా విభాగంలో లేరని ఆయన మాటలకు సంస్థతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సూర్యకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని క్లబ్ స్పష్టం చేసింది.
అగరం ఫౌండేషన్ ద్వారా విద్య, సామాజిక సేవ కార్యక్రమాలతోనే సూర్య ప్రజలకు సేవ చేస్తున్నారని ఆ పనులే ఆయనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ రాజకీయ ప్రయాణం గురించి మళ్లీ చర్చకొచ్చింది. ఫ్యాన్ క్లబ్‌లు కేవలం సినిమా ప్రమోషన్లకే కాకుండా ప్రజల కోసం పనిచేసే సంస్థలుగా ఎలా మారతాయో? వివరించారు. చాలా ఏళ్ల క్రితమే విజయ్ అభిమాన సంఘం అనేక సేవా కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు.
ఈ క్రమంలోనే విజయ్ లాగే సూర్య కూడా ఫ్యాన్ క్లబ్‌ను రాజకీయాలకు వాడుకుంటారా? అన్న సందేహం చాలామందిలో కలిగింది. దీనిపై సూర్య అభిమాన సంఘం మాత్రం సరైన స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో `విశ్వనాథ్ అండ్ సన్స్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సూర్య కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి చర్చల్లో బిజీగానూ ఉన్నారు.
