Begin typing your search above and press return to search.

'కంగువ' చేదు జ్ఞాపకం: పా.రంజిత్‌తో సూర్య ప్రయోగం ఫ‌లిస్తుందా?

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా `కంగువ`.

By:  Sivaji Kontham   |   8 Jun 2026 10:23 PM IST
కంగువ చేదు జ్ఞాపకం: పా.రంజిత్‌తో సూర్య ప్రయోగం ఫ‌లిస్తుందా?
X

భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా `కంగువ`. దర్శకుడు సిరుత్తై శివ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ `రా అండ్ రస్టిక్` చిత్రం స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంపై సూర్య ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నెగిటివ్ టాక్ కారణంగా సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆయన భార్య, నటి జ్యోతిక సైతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే ఈ సినిమాపై దుష్ప్రచారం చేశారని జ్యోతిక‌ వాదించిన‌... థియేటర్లలో సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ కథలోని అతి నాటకీయతను, మితిమీరిన శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా తిరస్కరించారు.

ఈ భారీ పరాజయం సూర్యను మానసికంగా దెబ్బతీసినా.. ఆయన మళ్లీ అలాంటి `రా అండ్ రస్టిక్` జోనర్‌ వైపు అడుగులు వేస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కల్ట్ క్లాసిక్ చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌తో సూర్య తన 48వ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం సాగుతోంది. పా.రంజిత్ తన సినిమాల్లో హీరోలను అత్యంత సహజంగా... సమాజంలోని అణగారిన వర్గాల ప్రతినిధులుగా.. రా క్యారెక్టర్లలో చూపించడంలో సిద్ధహస్తుడు. ఇటీవల `తంగలాన్` చిత్రంలో చియాన్ విక్రమ్‌ను అత‌డు చూపించిన విధానం ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఈ నేపథ్యంలో `కంగువ`లో లోపించిన బలమైన ఎమోషన్స్, నేటివిటీని పా.రంజిత్ తన మేకింగ్‌తో సరిదిద్దగలరని సూర్య గట్టిగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక్కడే ట్రేడ్ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైవిధ్యమైన కల్ట్ క్లాసిక్స్ తీయడంలో పా.రంజిత్ దిట్ట అయినా.. బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ విజయాలను అందించడంలో ఆయన రెగ్యుల‌ర్ గా తడబడుతున్నారు. రజనీకాంత్‌తో తీసిన `కబాలి`, విక్రమ్‌తో చేసిన `తంగలాన్` చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయే తప్ప థియేట్రికల్‌గా భారీ లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. కేవలం సామాజిక కోణాలకే పరిమితమై కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కన పెట్టే రంజిత్ శైలి భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చే సూర్య అభిమానులను పూర్తి స్థాయిలో మెప్పించగలదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ప్రస్తుతం సూర్య `కరుప్పు` వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాతో తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఊపును.. కమర్షియల్ మాస్ ఇమేజ్‌ను కాపాడుకోవాలంటే ఆయన సేఫ్ జోన్ కథలు చేయాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో `విశ్వనాథ్ & సన్స్`, జిత్తు మాధవన్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సూర్య, మళ్లీ పా.రంజిత్ వంటి ఆఫ్-బీట్ దర్శకుడితో ప్రయోగానికి సిద్ధమవడం సాహసమనే చెప్పాలి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ `కంగువ` మిస్టేక్‌ని సరిదిద్ది సూర్యకు ఒక క్లాసిక్ హిట్ అందిస్తుందో లేక పాత చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.