Begin typing your search above and press return to search.

సూర్య 'విశ్వనాథ్ & సన్స్'.. టీజర్ ఎలా ఉందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ & సన్స్ టీజర్ తాజాగా విడుదలై నెట్టింట వైరల్ గా మారింది.

By:  M Prashanth   |   16 March 2026 6:03 PM IST
సూర్య విశ్వనాథ్ & సన్స్.. టీజర్ ఎలా ఉందంటే?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వనాథ్ & సన్స్ టీజర్ తాజాగా విడుదలై నెట్టింట వైరల్ గా మారింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఆ చిత్రం తెరకెక్కుతుండగా.. టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

టీజర్ విషయానికొస్తే.. సూర్య సంజయ్ విశ్వనాథ్ అనే ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్ పాత్రలో కనిపిస్తున్నారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా పరిచయమవుతారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో పాటు భావోద్వేగాలను కలిపిన కథతో సినిమా రూపొందుతున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ముఖ్యంగా తండ్రి ప్రేమ, జీవిత పోరాటం, వ్యక్తిగత బాధ్యతల మధ్య తన కలను సాధించాలనే ఒక వ్యక్తి ప్రయాణాన్ని చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

టీజర్ ప్రారంభం నుంచే సూర్య తనదైన వింటేజ్ లుక్‌ తో ఆకట్టుకున్నారు. కెరీర్‌ లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన ఆయన మరోసారి ఎమోషన్స్ తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి రాసిన డైలాగ్స్ ఎఫెక్టివ్ గా ఉండగా, సూర్య చూపించిన ఎమోషన్స్ అందర్నీ కట్టిపడేస్తున్నాయి. సినిమాలో యంగ్ బ్యూటీ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌ లో ఆమె రోల్ యాక్టివ్ నెస్ తో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సూర్య కంటే వయసులో దాదాపు 20 ఏళ్లు చిన్నదైన యువతి ఆయనను ప్రేమించడం కథలో మెయిన్ ఎలిమెంట్ గా ఉండబోతున్నట్లు టీజర్ చెప్పకనే చెబుతోంది. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ యాంగిల్ ను దర్శకుడు చూపించబోతున్నట్టు తెలుస్తోంది. టీజర్‌ లో హీరోను ఆటపట్టిస్తూ హీరోయిన్ వెంటపడే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఆమె ప్రేమను హీరో వెంటనే అంగీకరించకపోవడం కథపై ఇంట్రెస్ట్ పెంచుతోంది.

తనకంటే చాలా చిన్న వయసున్న అమ్మాయి ప్రేమను సంజయ్ విశ్వనాథ్ ఎందుకు నిరాకరిస్తున్నాడన్న ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రేమ కథలో ఒక ట్విస్ట్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్‌ కు మంచి ఎలివేషన్ ఇచ్చింది. సినిమాటోగ్రాఫర్ నిమిష్ రవి విజువల్స్‌ ను ఆకట్టుకునేలా చిత్రీకరించగా, ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ టీజర్‌ ను మరింత అందంగా మార్చింది.

స్పోర్ట్స్, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సినిమాను జూలైలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు టీజర్ మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. మరి సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.