సూర్యకు అదే కలిసొచ్చిందా?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.
By: M Prashanth | 18 May 2026 2:46 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ, రెట్రో సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో అభిమానుల్లో కూడా కొంత నిరాశ కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా విడుదలైన కరుప్పు సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో వీరభద్రుడు పేరుతో విడుదలైన ఆ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ సృష్టించింది. సినిమా ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినా, ఓపెనింగ్స్ మాత్రం బాగానే దక్కించుకుంది.
అయితే సినిమా విడుదలైన తర్వాత మొదట వచ్చిన స్పందన పూర్తిగా పాజిటివ్ గా లేకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులు కథ, స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. విమర్శకుల నుంచి కూడా మిక్స్ డ్ రివ్యూలే వచ్చాయి. అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు కరుప్పు సినిమాకు కలిసొచ్చిన అంశాల్లో ప్రధానంగా సమ్మర్ సీజన్ ను చెప్పుకోవాలి. గత కొన్ని వారాలుగా థియేటర్లలో పెద్ద సినిమాలు లేకపోవడం కరుప్పు మూవీకి బాగా ఉపయోగపడిందని మూవీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులకు పెద్దగా ఆప్షన్లు లేకపోవడంతో ఆ సినిమా వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం కూడా కలెక్షన్లపై ప్రభావం చూపిందని భావిస్తున్నారు.
ముఖ్యంగా యాక్షన్ ఎలిమెంట్స్ కు మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోందని సమాచారం. కొన్ని ఫైట్స్, ఎలివేషన్ సీన్స్ థియేటర్లలో విజిల్స్ కొట్టేలా ఉన్నాయని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సినిమాకు ప్రధాన బలం అయిందని చెబుతున్నారు. ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ మాస్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కించిన సినిమా బీ, సీ సెంటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోందని టాక్.
ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటించారు. చాలా కాలం తర్వాత సూర్య-త్రిష జోడీ తెరపై కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. అలాగే కీలక పాత్రల్లో ఇంద్రాన్స్, స్వసిక విజయ్, యోగిబాబు, ఆడుకాలం నరేన్, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మార్యన్ తదితరులు నటించారు. సినిమాకు దర్శకుడిగా ఆర్జే బాలాజీ వ్యవహరించగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు చిత్రాన్ని నిర్మించారు. సాంకేతికంగా కూడా సినిమా మంచి మార్కులు దక్కించుకుంటోంది.
ఏదేమైనా ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో ఒకే చర్చ నడుస్తోంది. మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ సరైన సమయంలో విడుదల కావడం, పెద్ద పోటీ సినిమాలు లేకపోవడం, మాస్ ఎలిమెంట్స్ పనిచేయడం వంటి అంశాలు కరుప్పు మూవీకి కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో సినిమా మంచి ఆక్యుపెన్సీతో కొనసాగుతుండటంతో ఫైనల్ రన్ లో మూవీ ఇంకెంత వసూళ్లు సాధిస్తుందో చూడాల్సి ఉంది.
