స్టార్ హీరో సినిమాకు రిలీజ్ డేట్ ఇబ్బందులు
కమర్షియల్ గా సక్సెస్ అయిన పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు సూర్యకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
By: Sravani Lakshmi Srungarapu | 13 Sept 2025 11:21 AM ISTకోలీవుడ్ స్టార్ హీరోగా మంచి క్రేజ్ ఉన్న సూర్యకు గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. సూర్య నుంచి ఆఖరిగా వచ్చిన కంగువ, రెట్రో సినిమాలు ఎలాంటి ఫలితాన్నిచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కమర్షియల్ గా సక్సెస్ అయిన పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు సూర్యకు మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
వరుస ఫ్లాపులతో దెబ్బతిన్న సూర్య మార్కెట్
ఆ ఫ్లాపుల కారణంగా సూర్య మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుతం సూర్య, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కరుప్పు అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ను జరుపుకుంటుంది. ఈ మూవీకి ఫాంటసీ టచ్ కూడా ఉండటంతో మాస్ లో కరుప్పు పై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి.
సంక్రాంతికి భారీ పోటీ
వాస్తవానికి కరుప్పుని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ జనవరి 9న దళపతి విజయ్ జన నాయగన్, జనవరి 14న పరాశక్తి రిలీజవుతుండటంతో దీన్ని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. అటు జన నాయగన్, పరాశక్తిపై భారీ క్రేజ్ ఉండగా, కరుప్పు మీద మాత్రం పెద్దగా హైప్ లేదు. అందుకే ఇప్పటివరకు కరుప్పు రిలీజ్ డేట్ గురించి మేకర్స్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇంకా జరగని ఓటీటీ బిజినెస్
పైగా సంక్రాంతి టైమ్ లో తెలుగు నుంచి కూడా భారీ పోటీ ఉంది. ప్రభాస్ రాజా సాబ్, చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ76 కూడా పండక్కే వస్తున్నాయి. వీటితో పోటీ ఎందుకులే అని కరుప్పును ఏప్రిల్ 14న రిలీజ్ చేద్దామని చూస్తున్నారట మేకర్స్. పైగా ఈ సినిమాకు ఓటీటీ డీల్ కూడా జరగలేదట.
డైరెక్టర్ గా ఆర్జే బాలాజీకి పెద్దగా మార్కెట్ లేకపోవడంతో ఆ ఎఫెక్ట్ కరుప్పుపై పడిందని అంటున్నారు. అందుకే రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఆచితూచి వ్యవహరిస్తున్నారట. మరోవైపు వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమా శరవేగంగా పరుగులు పెడుతుంది. ఆ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ కరుప్పు ఏప్రిల్ లో రిలీజ్ అయితే వెంకీ సినిమా దసరా, దీపావళికి పోస్ట్‌పోన్ చేయాల్సి ఉంటుంది. మరి రిలీజ్ డేట్ విషయంలో కరుప్పు మేకర్స్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూడాలి.
