పాన్ ఇండియాలో 'సూర్య ది గ్రేట్' అనిపించుకునేదెప్పుడు?
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కథానాయకుడు సూర్య ఇటీవల రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే
By: Sivaji Kontham | 6 May 2026 7:00 AM ISTదక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కథానాయకుడు సూర్య ఇటీవల రేసులో వెనకబడిన సంగతి తెలిసిందే. `గజిని`తో సెన్సేషన్ క్రియేట్ చేసి, `సింగం` సిరీస్‌తో మాస్ బాక్సాఫీస్ వద్ద గర్జించిన ఈ స్టార్ హీరో గత కొంతకాలంగా సరైన కమర్షియల్ సక్సెస్ లేక రేసులో కాస్త వెనకబడ్డారు. జై భీమ్, సూరరై పొట్రు వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు, జాతీయ అవార్డులు అందుకున్నా థియేటర్ల వద్ద వందల కోట్ల వసూళ్లను రాబట్టే పక్కా మాస్ హిట్ కోసం ఆయన అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ.. సూర్య తన సత్తా ఏంటో నిరూపించడానికి `కరుప్పు` (తెలుగులో వీరభద్రుడు) చిత్రంతో సిద్ధమయ్యారు.
దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుని యుఏ సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సినిమా మే 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో సూర్య `శరవణన్` అనే న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. చట్టపరంగా న్యాయం జరగని పక్షంలో కరుప్పుసామి అనే దైవ అంశ ఆయనలోకి ప్రవేశించి `దైవిక న్యాయం` ఎలా అందించింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సూపర్ హీరో డ్రామా రూపొందింది. కమర్షియల్ అంశాలతో పాటు దైవత్వాన్ని జోడించిన ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్ సూర్యను మళ్ళీ పాన్ ఇండియా రేసులో నిలబెడుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
విశేషమేమిటంటే.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత `ఆరు` (2005) కాంబినేషన్ పునరావృతమవుతూ.. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది. ఆర్జే బాలాజీ తన ఫేవరెట్ హీరో కోసం యాక్షన్, డ్యాన్స్, ఎమోషన్స్ కలగలిపిన ఒక పర్ఫెక్ట్ మాస్ సూపర్ హీరో కథను సిద్ధం చేశారు. యోగి బాబు, ఇంద్రన్స్ వంటి నటీనటులు ప్రధాన ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సూర్య అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
చాలా కాలంగా సరైన థియేట్రికల్ సక్సెస్ లేని సూర్యకు ఈ సినిమా ఒక `మేక్ ఆర్ బ్రేక్` లాంటిది. సూర్య టైమ్ మళ్ళీ మొదలైందా? `కరుప్పు`తో ఆయన తన పూర్వవైభవాన్ని పొందుతారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ ఈ సినిమా పెద్ద రేంజులో క్లిక్ అయితే సూర్య పాన్ ఇండియా రేసులోకి దూసుకొచ్చేందుకు ఛాన్సుంటుంది. ఆనాటి గజిని, సింగం రోజుల తరహాలోనే బాక్సాఫీస్ గర్జనను మళ్ళీ చూడాలని సినీ లోకం ఆకాంక్షిస్తోంది. 500 -1000 కోట్ల రేంజులో వసూళ్లను అందుకుంటేనే ఈ రోజుల్లో పెద్ద పాన్ ఇండియా హిట్టుగా చూస్తున్నారు. మరి ఆ రేంజులో కరుప్పు సూర్యకు గ్రేట్ కంబ్యాక్ అవుతుందా? అన్నది చూడాలి.
