ప్రాజెక్ట్ 'కర్ణ'కు ఉన్న ఏకైక ఆప్షన్ అదొక్కటే?
సూర్య నటించిన చివరి భారీ చిత్రం `కంగువ` డిజాస్టరవ్వడంతో అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ ట్రెండ్ లో ఉంది.
By: Sivaji Kontham | 1 Feb 2026 2:06 PM ISTఒక ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాత ఒక మాట అన్నారు. ఏదైనా ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు దానిని అమల్లో పెట్టే సమయం (టైమ్ పీరియడ్) చాలా ముఖ్యమైనది. ఆ టైమ్ పీరియడ్‌లో కాకుండా ఎప్పుడో చేయాలని అనుకుంటే అవకాశం చేజారిపోతుంది. అప్పటికే దానిని వేరొకరు ఊహించి పూర్తి చేయొచ్చు కూడా.
ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో అనుకున్న ఓ భారీ ప్రాజెక్ట్ పరిస్థితి కూడా అలాగే ఉండనుందని భావిస్తున్నారు. సూర్య కోసం రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా లాంటి సీనియర్ దర్శకుడు `కర్ణ` స్క్రిప్టును రెడీ చేసారు. దీనిని రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసారు. అయితే ఈ రెండు భాగాల కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని కూడా లెక్కలు వేసారు. అయితే ఇంత పెద్ద బడ్జెట్ చూశాక నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.
సూర్య నటించిన చివరి భారీ చిత్రం `కంగువ` డిజాస్టరవ్వడంతో అతడి మార్కెట్ పూర్తిగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఈ బడ్జెట్ చూసి సూర్యపై అంత పెట్టేందుకు హిందీ బెల్ట్ లో ఎవరూ సిద్ధంగా లేరని కూడా కథనాలొచ్చాయి. ఒకవేళ సూర్య కంగువతో హిట్టు కొట్టి ఉంటే, దర్శకనిర్మాతలు కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్లేవారు. కానీ అనూహ్యంగా అది ఫ్లాప్ గా మారింది. ఆ తర్వాత కర్ణ ప్రాజెక్ట్ విషయంలో రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సైతం సందిగ్ధంలో పడ్డారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును రాజీ అన్నదే లేకుండా అత్యంత భారీతనంతో విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారు. దీంతో ఈ సినిమాని ప్రస్తుతానికి వాయిదా వేసుకుని సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని కథనాలొస్తున్నాయి.
దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌పై గత ఐదారేళ్లుగా తీవ్రంగానే శ్రమించారు. మహాభారతంలోని అత్యంత విరోచితమైన `కర్ణుడి` పాత్రను గొప్ప ప్రామాణికతతో చూపించాలని, అందుకే స్క్రిప్ట్ విషయంలో అస్సలు రాజీ పడకుండా సమయం తీసుకుంటున్నారని సమాచారం. కథ, స్క్రిప్టు విషయంలో రాజీ పడలేదు. అలాగే బడ్జెట్ పరంగానూ రాజీ పడేందుకు దర్శకుడు సిద్దంగా లేడని తెలుస్తోంది బడ్జెట్ తగ్గించి సినిమా క్వాలిటీని దెబ్బతీయడం ఇష్టం లేక, ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను `హోల్డ్`లో ఉంచారని చెబుతున్నారు. స్క్రిప్టు సిద్ధమై రెహమాన్ ఐదారు పాటల్ని కూడా సిద్ధం చేసారని, కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయిందని... ఇటీవల దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా చెప్పారు. `కర్ణ` వాయిదా పడటంతో ప్రస్తుతం సూర్య తన కెరీర్ 44వ సినిమా, 45వ సినిమాపై దృష్టి సారించారు.
అయితే ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించడానికి సరైన సమయం ఇదే. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ పీక్స్ లో ఉంది. ఇంకా ఆలస్యమైతే పరిస్థితులు చేజారిపోవచ్చు. మునుముందు మహాభారతం కాన్సెప్టుతో సినిమాల్ని రూపొందించేందుకు పలువురు దిగ్గజ దర్శక నిర్మాతలు, హీరోలు ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందుకే మహాభారతం కాన్సెప్టులతో సినిమాలు రాక ముందే కర్ణ సినిమా విడుదల కావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆలస్యం చేస్తే, దానికి అంతగా క్రేజ్ ఉండకపోవచ్చు.
సూర్య కాకపోతే ఇంకెవరు?
ప్రస్తుతం రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా `కర్ణ` స్క్రిప్టు కోసం సూర్య స్థానంలో వేరొక సౌత్ హీరోని ఎంపిక చేసుకునే ఛాన్సుంటే, అది కచ్ఛితంగా అల్లు అర్జున్ లేదా ప్రభాస్ ఎవరో ఒకరు కావొచ్చు. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత క్రేజీ పాన్ ఇండియా స్టార్లుగా ఆ ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ లేదా ప్రభాస్ నటిస్తున్నారు అంటే ఆ ప్రాజెక్ట్ కి మార్కెట్ పరమైన సమస్యలు ఉండవు. మినిమం 1000 కోట్ల క్లబ్ హీరోలుగా వారికి గుర్తింపు ఉంది. అయితే `కల్కి 2898 ఏడి` చిత్రంలో ప్రభాస్ ఇప్పటికే కర్ణుడి ఛాయలు ఉన్న పాత్రలో నటించారు గనుక చిన్న ఇబ్బంది ఉంది. వెంట వెంటనే ఒకే తరహా పాత్రలో నటించే ఆలోచన ప్రభాస్ చేస్తారా? అన్నది ఆలోచించాలి. ఇలాంటి ఇబ్బంది అల్లు అర్జున్ విషయంలో ఉండేందుకు ఛాన్స్ లేదు. అయితే ఇతర హీరోలతో రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా ముందుకు సాగేందుకు బహుశా సూర్య అనుమతి అవసరమవుతుందేమో!
