భార్యా-భర్తల బంధంపై గొప్పగా సెలవిచ్చిన సూర్య
కోలీవుడ్ స్టార్ సూర్య వైవాహిక జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
By: Srikanth Kontham | 3 Aug 2026 8:00 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య వైవాహిక జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వివాహ వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో భార్య జ్యోతికతో తనకున్న సుదీర్ఘ బంధం .. శాశ్వత ప్రేమకు అసలు రహస్యం ఏంటో? సూర్య అభిమానులతో పంచుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అన్యోన్య దంపతులుగా కొనసాగుతున్న సూర్య, జ్యోతికల జోడీ కోలీవుడ్‌లో ఎంతో ఆదర్శవంతమైన జోడీగా పేరుంది. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ పెళ్లితోనే ప్రేమ ముగిసిపోదని వివాహం తర్వాత కూడా ప్రతి రోజూ ఆ ప్రేమను పంచుకుంటూనే ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇరవై ఏళ్ల వయసులో ఉండే పరిణతి యాభై ఏళ్లకు వచ్చేసరికి మారుతుందని ఆలోచనలు, ప్రాధాన్యతలు మారినా? భాగస్వామిపై చూపించే ప్రేమ, ఆప్యాయత మాత్రం ఎప్పటికీ మారకూడదన్నారు. కుటుంబం ..పిల్లల బాధ్యతల నిర్వహణలో మహిళలు ఎన్నో త్యాగాలు చేస్తారని సూర్య కొనియాడారు. ఇంటా బయటా సర్దుకుపోయే మహిళల విజయాలను చూసి పది కాదు.. వందసార్లు సెల్యూట్ చేయాలని పేర్కొన్నారు. కష్టసుఖాల్లో వారికి అండగా నిలవాలని.. తగిన గౌరవం ఇవ్వాలని.. యువతకు తన అభిమానులకు సూర్య హితవు పలికారు.
సూర్య, జ్యోతికల ప్రయాణం 1999లో వచ్చిన 'పూవెల్లం కేట్టుప్పార్' సినిమాతో ప్రారంభమైంది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మొదలైన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో సుదీర్ఘకాలం ప్రేమలో ఉన్న తర్వాత సెప్టెంబర్ 2006న వివాహం చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ దంపతుల కు దియ, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కలరు.
ఒకవైపు సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే..మరోవైపు జ్యోతిక కూడా నటనను కొనసాగిస్తున్నారు. వివాహం..పిల్లల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా? ఆ తర్వాత మాత్రం నటిగా కొనసాగుతున్నారు. ఇటీవల హిందీ చిత్రాలైన 'శైతాన్', 'శ్రీకాంత్' వంటి చిత్రాలతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన 'సిస్టమ్' డ్రామాతో జ్యోతిక ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే సూర్య నటించిన `కరుప్పు` తో మంచి విజయాన్ని అందుకున్నారు. త్వరలోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇలా వ్యక్తిగత జీవితంలో ఆదర్శ దంపతులుగా నిలుస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న సూర్య-జ్యోతిక జంట ఇండ స్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ఒకరికొకరు ఇచ్చుకునే స్పేస్ శాశ్వత బంధానికి ఎంతగానో దోహదపడతాయన్నది అంతే వాస్తవం. నేటి సమాజంలో విడాకులనేది కామన్ గా మారిన వేళ సెలబ్రిటీలలో కొన్ని జోడీలను చూస్తుంటే? అందరూ సఖ్యతతో ఉంటే? విడాకులనే మాటే ఏ జోడీ మధ్య రాదు.
