Begin typing your search above and press return to search.

రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆదర్శ జంటగా స్టార్ కపుల్!

గ్లామర్ ప్రపంచంలో పెళ్లిళ్లు, విడాకులు చాలా సాధారణం అయిపోయిన ఈ రోజుల్లో.. ఇరవై ఏళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తూ విజయవంతంగా వైవాహిక జీవితాన్ని సాగించడం మామూలు విషయం కాదు.

By:  Madhu Reddy   |   11 Oct 2026 7:23 PM IST
రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ ఆదర్శ జంటగా స్టార్ కపుల్!
X

సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేయడం ఒకెత్తయితే, వ్యక్తిగత జీవితాన్ని అన్యోన్యంగా ముందుకు తీసుకెళ్లడం మరొకెత్తు. ఈ విషయంలో సౌత్ సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే జంట సూర్య - జ్యోతిక. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఈ ఇద్దరూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల తమ 20 ఏళ్ల బంధాన్ని మళ్లీ పెళ్లి చేసుకున్నంత వేడుకగా జరుపుకుని వార్తల్లో నిలిచారు. ఈ క్యూట్ కపుల్ బాండింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం!

ఇరవై ఏళ్ల ప్రేమానుబంధం:

గ్లామర్ ప్రపంచంలో పెళ్లిళ్లు, విడాకులు చాలా సాధారణం అయిపోయిన ఈ రోజుల్లో.. ఇరవై ఏళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తూ విజయవంతంగా వైవాహిక జీవితాన్ని సాగించడం మామూలు విషయం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య, జ్యోతిక దంపతులు కాలం గడుస్తున్న కొద్దీ తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ జంట, నిజ జీవితంలోనూ అంతే అన్యోన్యతను కనబరుస్తూ అందరి మనసులనూ గెలుచుకుంటున్నారు.

భార్య ఆశయాలకు స్టార్ హీరో మద్దతు:

సూర్య కేవలం మంచి భర్త మాత్రమే కాదు, భార్య ఆలోచనలకు నిండుగా గౌరవం ఇచ్చే వ్యక్తి. కొన్నేళ్ల విరామం తర్వాత జ్యోతిక మళ్లీ సినిమాల్లోకి రావలని అనుకున్నప్పుడు సూర్య ఏమాత్రం వెనుకాడలేదు. స్వయంగా తన సొంత బ్యానర్‌లోనే మంచి కథాంశాలు ఉన్న చిత్రాలను నిర్మిస్తూ ఆమె కెరీర్‌ను ప్రోత్సహించారు. సమాజంలో మహిళా సాధికారత గురించి మాట్లాడటమే కాకుండా, తన ఇంట్లోనే భార్య ఆశయాలకు పూర్తి మద్దతుగా నిలుస్తూ నిజమైన మోడ్రన్ పార్ట్‌నర్‌గా నిలిచారు.

పిల్లల బాధ్యతల్లో భాగస్వామ్యం:

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సూర్య కుటుంబం కోసం సమయం కేటాయించడం మాత్రం మర్చిపోరు.. తమ పిల్లల చదువు, స్కూల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ విషయాలను సూర్య స్వయంగా ఫాలో అప్ చేస్తారని జ్యోతిక పలు సందర్భాల్లో చెప్పారు. రోజువారీ స్కూల్ మెయిల్స్ చూడటం నుంచి పేరెంట్స్ మీటింగ్స్‌కు వెళ్లడం వరకు ప్రతీ చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటారు. సినిమాలు, కుటుంబం.. రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లొచ్చని సూర్య తన ప్రవర్తనతో చూపిస్తున్నారు.

ఆదర్శవంతమైన జీవన శైలి:

సూర్య , జ్యోతిక దంపతులు కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. అగరం ఫౌండేషన్ ద్వారా వేలాది మంది పేద పిల్లల చదువుకు సహాయం చేస్తూ ఎంతోమందికి వెలుగునిస్తున్నారు. నిరాడంబరంగా జీవిస్తూ, తమ నడవడికతో తోటి సెలబ్రిటీలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు.

ఇక సూర్య,జ్యోతిక కేవలం స్టార్ కపుల్ మాత్రమే కాదు.. ప్రేమ, గౌరవంతో వైవాహిక జీవితాన్ని ఎలా కొనసాగించాలో చూపిస్తున్న ఆదర్శ జంట. కెరీర్‌తో పాటు కుటుంబానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న వీరి ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం.