రజనీ అమితాబ్‌లకు ధీటుగా వినోదం పంచే హీరో
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన `మాస్ జాతర` ఈ నెల 31న థియేటర్లలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 29 Oct 2025 9:18 AM ISTమాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటించిన `మాస్ జాతర` ఈ నెల 31న థియేటర్లలోకి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రాజా ఫ్యాన్స్ ఎంతో ఎగ్జయిటింగ్ వేచి చూస్తున్న ఈ సమయంలో ప్రీరిలీజ్ వేడుకతో ఫ్యాన్ ఫీవర్ మరింతగా రాజుకుంది. థియేటర్లలో ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేయాలా? అనే ఉత్కంఠతో అభిమానులు వేచి చూస్తున్నారు. టీజర్ ట్రైలర్ ఇప్పటికే ఫ్యాన్స్ సహా ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. మాస్ రాజా ఈసారి కచ్ఛితంగా పెద్ద హిట్టు కొడతాడనే ధీమా అందరిలో కనిపిస్తోంది. ప్రీరిలీజ్ వేడుకతో పాజిటివ్ వైబ్స్ పీక్స్ కు చేరుకున్నాయి. ఇక ఈ వేదికపై చిత్రనిర్మాత నాగవంశీ మాస్ రాజాకు పెద్ద హిట్టిస్తున్నాననే ధీమాను, కాన్ఫిడెన్స్ ను కనబరిచారు.
సూర్య ఫ్యాన్ బోయ్ మూవ్‌మెంట్:
ఈ వేదికపై ముఖ్య అతిథి సూర్య మాట్లాడుతూ... ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే అది రవితేజ! అంటూ మాస్ రాజా ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపారు. రవితేజ గారితో ఇరవై ఏళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పేరు వింటేనే మాకు(కుటుంబానికి) ఆనందం కలుగుతుందని ఒక ఫ్యాన్ బోయ్ లా మాట్లాడారు.
చాలా ఏళ్లుగా రవితేజ గారిపై అభిమానులు ఎంతో ప్రేమని కురిపిస్తున్నారు. తెరపై ఒక కామన్ మ్యాన్ ని కింగ్ సైజ్ లో సహజంగా చూపించాలంటే అది రవితేజ గారికే సాధ్యమవుతుంది. తన సహజ నటనతో పాత్రకు ప్రాణం పోస్తారు. ఆయన నటనకు నేను అభిమానిని. నవ్వించడం అనేది చాలా కష్టం. కానీ, రవితేజ మాత్రం తనదైన శైలిలో చాలా తేలికగా ఎన్నో ఏళ్ళుగా వినోదాన్ని పంచుతున్నారు. తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఆయన చేస్తారు. ఇడియట్, కిక్ సహా రవితేజ గారు నటించిన పలు సినిమాలు తమిళ్ లోనూ మంచి ఆదరణ పొందాయి. విక్రమార్కుడు రీమేక్ నా సోదరుడు కార్తీ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. రవితేజ గారిలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదు. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. ఆయన ఇలాగే వినోదాన్ని పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను`` అని అన్నారు.
ఎందరికో స్ఫూర్తి నింపిన హీరో:
అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలై, సపోర్టింగ్ యాక్టర్ గా, ఇప్పుడు మాస్ మహారాజాగా ఎదిగిన రవితేజ ఎందరికో స్ఫూర్తినిచ్చారని సూర్య అన్నారు. ``నాగవంశీ వరుస సినిమాలు చేస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఆయన బ్యానర్ లో నేను ఒక సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది`` అని అన్నారు. మాస్ జాతరకు అద్భుత సంగీతం అందించిన భీమ్స్ తో భవిష్యత్తులో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నాను అని కూడా అన్నారు.
ఇలా అంగీకరించడం చాలా అరుదు:
అయితే ఈ వేదికపై సూర్య ఎంతో నిజాయితీగా తాను మాస్ మహారాజ్ రవితేజకు అభిమానిని అని ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. రంగుల ప్రపంచంలో ఒక పెద్ద హీరో ఇలా అంగీకరించడం చాలా అరుదు. సౌతిండియాలోనే అతిపెద్ద స్టార్లలో ఒకరైన సూర్య ఎంతో నిజాయితీగా ఎలాంటి భేషజాలకు పోకుండా ఈ ప్రకటన చేయడం నిజంగా రవితేజ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. తన తమ్ముడు కార్తి రవితేజ నటించిన విక్రమార్కుడు రీమేక్ తో విజయం సాధించాడని, మేమంతా ఆయనకు ఫ్యాన్స్ అని నిరభ్యంతరంగా ఒప్పుకున్నారు సూర్య. నిజానికి రవితేజకు ఇటీవలి కాలంలో విజయాలు దక్కకపోవచ్చు. రొటీన్ స్టఫ్ ఆయనను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ అతడిలోని ఎనర్జిటిక్ పెర్ఫామరో ఎందరికో స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
