Begin typing your search above and press return to search.

సూర్య 46 : సంజయ్‌ రామస్వామి మళ్లీ వస్తే...!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 Jun 2025 11:29 AM IST
సూర్య 46 : సంజయ్‌ రామస్వామి మళ్లీ వస్తే...!
X

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఏడాదిలో ఇప్పటికే 'రెట్రో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య త్వరలోనే 'కురుప్పు' సినిమా తో రాబోతున్నాడు. ఆర్‌ జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కురుప్పు సినిమా విడుదలకు ముందే సూర్య తన కొత్త సినిమాను మొదలు పెట్టాడు. సూర్య 46 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న కొత్త సినిమాకు గాను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు సిద్ధం అయింది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది.

సూర్య 46 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వెంకీ అట్లూరి నుంచి వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా వెంకీ అట్లూరి గత చిత్రం లక్కీ భాస్కర్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దుల్కర్‌ సల్మాన్‌కి పాన్ ఇండియా ఇమేజ్‌ను తెచ్చి పెట్టడంతో పాటు, వంద కోట్లకు పైగా వసూళ్లు తెచ్చి పెట్టిన సినిమాగా లక్కీ భాస్కర్‌ నిలిచిన విషయం తెల్సిందే. వెంకీ అట్లూరి రెడీ చేసిన కథ నచ్చడంతో సూర్య వెంటనే ఈ సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. అంతకు ముందు కమిట్‌ అయిన ఒక సినిమాను పక్కన పెట్టి మరీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సూర్య ఓకే చెప్పాడని సమాచారం.

తాజాగా ఒక చిట్‌ చాట్‌లో వెంకీ అట్లూరి మాట్లాడుతూ... సూర్యతో తాను చేస్తున్న సినిమా చాలా స్పెషల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాలో సూర్య పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుంది. సూపర్‌ హిట్‌ మూవీ గజిని లో సంజయ్ రామస్వామి పాత్ర ఎలా ఉంటుందో అలాంటి పాత్రను సూర్య ఈ సినిమాలో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. గజిని కల్ట్‌ సూపర్‌ హిట్‌ బొమ్మ. అలాంటి సూపర్‌ హిట్‌ సినిమాలోని సంజయ్‌ రామస్వామి పాత్రను ఎప్పటికీ మరచి పోలేం. అలాంటి పాత్రను మరోసారి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. భావోద్వేగాలతో కూడిన పాత్రలతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు.

నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. తెలుగులో ఈయన వరుస సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మ్యూజికల్‌ హిట్స్‌ను సొంతం చేసుకుంటున్నాడు. వెంకీ అట్లూరికి మంచి మ్యూజికల్‌ టేస్ట్‌ ఉంటుందని అంటారు. ఈ సినిమాతో మరోసారి ఆయన మ్యూజికల్‌ హిట్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో ఈ సినిమా టైటిల్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.