తెలుగు దర్శకుడితో సూర్య మొదటి అడుగు పడింది!
తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Tupaki Desk | 11 Jun 2025 12:22 PM ISTతమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా కాలంగా అతనితో సినిమా చేయాలని పలువురు టాలీవుడ్ దర్శకులు ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇక ఇప్పుడు ఫైనల్ గా కొత్త సినిమా ‘సూర్య 46’తో ఆ కాంబో సెట్స్ పైకి వస్తోంది. వెంకీ అట్లూరి చెప్పిన కథకు సూర్య జెట్ స్పీడ్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చకచకా పనులు మొదలయ్యాయి.
ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సూర్యతో పాటు గీతా గోపాల్, రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, మమీతా బాజీ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా కథపై ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేకపోయినా, సూర్య పాత్ర గురించి మాత్రం పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. ఇక షూటింగ్ ప్రారంభం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. అందులో సూర్య బ్రౌన్ జాకెట్, లైట్ గ్రే ప్యాంట్స్ ధరించి నడుచుకుంటూ వెనక్కి తిరిగిన లుక్‌లో కనిపించడంతో ఇంటెన్సిటీ ఏంటో క్లియర్ అయింది. 'అండ్ ది సెలబ్రేషన్ బిగిన్స్' అనే ట్యాగ్‌లైన్ ఆసక్తికరంగా మారింది.
ఇంతకుముందు 'జై భీమ్', 'సూరరై పోట్రు' లాంటి సినిమాలతో సూర్య తన యాక్టింగ్ లెవెల్ ను టాప్ లెవెల్లో చూపించాడు. ఇప్పుడు ఈ సినిమాలో మాత్రం మరో కొత్త కోణాన్ని చూపించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ అట్లూరి గతంలో చేసిన సినిమాల్లో భావోద్వేగాలకు పెద్ద పీట వేసిన దృష్ట్యా, ఈ ప్రాజెక్ట్‌లో కూడా మాస్ అండ్ ఎమోషన్ మిక్స్ ఉంటుందన్న నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఇది సూర్య కెరీర్‌లో మరో బిగ్ హిట్ కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రెండ్ వస్తోంది. #Suriya46 హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో ఉండగా, పోస్టర్‌లోని స్టైలిష్ లుక్ సూర్య ఫ్యాన్స్‌ను ముంచెత్తుతోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ పనులలో ఉన్నారు. టెక్నికల్ టీం కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నది స్పష్టంగా తెలుస్తోంది.