Begin typing your search above and press return to search.

టికెట్ ధ‌ర‌ల పెంపుపై హైకోర్టు నిర్ణ‌యానికి సుప్రీం చెక్

హైకోర్టు గతంలో అడ్డగోలుగా ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 7A ని ప్రస్తావించింది.

By:  Sivaji Kontham   |   13 March 2026 9:00 PM IST
టికెట్ ధ‌ర‌ల పెంపుపై హైకోర్టు నిర్ణ‌యానికి సుప్రీం చెక్
X

తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో రాష్ట్ర హైకోర్టు విధించిన `90 రోజుల ముందస్తు నోటీసు` నిబంధనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ నిర్ణయంతో టాలీవుడ్ కు.. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలకు పెద్ద ఊరట లభించినట్లయింది. హైకోర్టు ఉత్తర్వుల వల్ల తలెత్తిన న్యాయపరమైన చిక్కుముడులు తాత్కాలికంగా తొలగిపోవడంతో మళ్లీ పాత నిబంధనల ప్రకారమే టికెట్ల ధరల పెంపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఏర్పడింది.

ఈ వివాదం మూలాలు గతంలో విడుదలైన `రాజాసాబ్`, `మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు` వంటి పెద్ద సినిమాల టికెట్ ధరల పెంపుతో మొదలయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం జారీ చేసిన మెమోలను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పారదర్శకత ఉండాలని ధరలు పెంచే ముందు 90 రోజుల ముందే పబ్లిక్ డొమైన్‌లో సమాచారం ఉంచాలని హోంశాఖను ఆదేశించింది. అయితే ఈ నిబంధన ఆచరణలో సాధ్యం కాదంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్ ఈ కేసును లోతుగా విచారించింది. సినిమా పరిశ్రమలో షూటింగ్ దశ నుంచి విడుదల వరకు బడ్జెట్ అంచనాలు మారుతుంటాయని.. మూడు నెలల ముందే ధరలను ఖరారు చేయడం అసాధ్యమని నిర్మాతల తరపు న్యాయవాదులు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూనే, తెలంగాణ ప్రభుత్వం ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

హైకోర్టు గతంలో అడ్డగోలుగా ధరలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ యాక్ట్ 1955 లోని సెక్షన్ 7A ని ప్రస్తావించింది. సామాన్య ప్రజలకు కూడా ధరల పెంపుపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. కానీ చిత్ర పరిశ్రమ వాదన మరోలా ఉంది. విడుదల తేదీ కంటే చాలా కాలం ముందుగానే ధరలపై నిర్ణయం తీసుకోవడం వల్ల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం కష్టమవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సాధారణంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు రిలీజ్ కు ఒకటి రెండు రోజుల ముందు మాత్రమే ప్రభుత్వం పెంపు జీవోలను ఇస్తుంటుంది. హైకోర్టు తీర్పు అమలైతే విడుదల తేదీ కంటే 90 రోజుల ముందే అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఇది నిర్మాతల ఆర్థిక ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మైత్రీ మూవీ మేకర్స్ తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఇప్పుడు రిలీజ్ కి రాబోయే పెద్ద సినిమాల విషయంలో ఈ గందరగోళం తొలగిపోయింది.

ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే టికెట్ల ధరల పెంపు నిర్ణయాలు ఉండనున్నాయి. అయితే సుప్రీంకోర్టులో తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పారదర్శకత - ప్రజా సమాచార హక్కును కాపాడుతూనే.. చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను దెబ్బతీయకుండా ఉండేలా మధ్యేమార్గంగా తీర్పు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతవరకు టాలీవుడ్ వర్గాల్లో ఈ సుప్రీంకోర్టు స్టే ఒక పెద్ద విజయంగానే పరిగణించబడుతోంది. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకునే త‌దుప‌రి చ‌ర్య‌లు ఏమిట‌నేది తెలియాల్సి ఉంది.